
ఉద్రిక్తతల నడుమ ఖాళీ చేయించిన అధికారులు
15 రోజుల్లో అసలైన లబ్ధిదారులకు ఇస్తామని సికింద్రాబాద్ ఆర్డీఓ వెల్లడి
పద్మారావునగర్, వెలుగు: ఓల్డ్ మారేడ్ పల్లిలో అక్రమంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఉంటున్న వారిని అధికారులు సోమవారం ఖాళీ చేయించారు. ఓల్డ్ మారేడ్ పల్లిలో మొత్తం 22 బ్లాకుల్లో 468 ఇండ్లను ప్రభుత్వం నిర్మించింది. ఇందులో 2022లో తొలి విడతగా 273 మందికి ఇండ్లను కేటాయించారు. 49 మంది అక్రమంగా ఇండ్లను అక్రమించి నివాసం ఉంటున్నారని రెవెన్యూ అధికారులకు సమాచారం అందగా.. అధికారులు ఎంక్వైరీ నిర్వహించారు.
ముందస్తు భద్రత కోసం భారీగా పోలీసు బలగాలు, అగ్నిమాక వాహనాలు, అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచారు. సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరామ్ ఆధ్వర్యంలో అధికారులు ఎంక్వైరీ చేసి, 16 ఇండ్లకు తాళాలు వేశారు. మిగతా వారి పేర్లు రెండో విడత లబ్ధిదారుల జాబితాలో ఉన్న నేపథ్యంలో త్వరలోనే వారికి ఇండ్లు కేటాయింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ తెలిపారు.
15 రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేసి, మొత్తం 190కి పైగా ఇండ్లను లబ్ధిదారులకు అందేలా చూస్తామన్నారు. ఈ సందర్భంగా మోండా మార్కెట్ కార్పొరేటర్ దీపిక మాట్లాడుతూ.. తొలి విడత లబ్ధిదారుల జాబితా విడుదలై మూడేండ్లు కావస్తున్నా ఇప్పటికీ రెండో విడత ఇండ్ల కేటాయింపు జరగకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.