
- విలీన ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో నిర్మాణాలు
- అడ్డుకోబోయిన ఈవో, సిబ్బందిపై దాడికి యత్నం
భద్రాచలం, వెలుగు : విలీన ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి చెందిన 890 ఎకరాల భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. శుక్రవారం గోశాలకు ఎదురుగా పరదాలు కట్టి గుట్టుచప్పుడు కాకుండా భవన నిర్మాణం చేపడుతుండగా ఈవో రమాదేవి సిబ్బందితో కలిసి అడ్డుకోవడానికి అక్కడికి వెళ్లారు. దీంతో ఈవోతో పాటు ఆమె దఫేదార్పై ఆక్రమణదారులు దాడికి యత్నించారు. ఈవో రంపచోడవరం ఎమ్మెల్యేతో పాటు పోలీసులకు సమాచారమివ్వడంతో బందోబస్తుకు బలగాలు వచ్చాయి.
గ్రామ సెక్రెటరీ కూడా వచ్చి ఆక్రమణలు ఆపాలని హెచ్చరించారు. 1970 నుంచి 2022 వరకు దేవస్థానానికి అనుకూలంగానే కోర్టు తీర్పులున్నాయని, తాజాగా ఏపీ హైకోర్టు కూడా అవి దేవస్థాన భూములేనని తేల్చిందని వారు ఆక్రమణదారులకు వివరించారు. ఈ సందర్భంగా ఆక్రమణదారులు ఒకవైపు, దేవస్థాన సిబ్బంది, అర్చకులు మరోవైపు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. భవన నిర్మాణ పనులను నిలిపివేయాలంటూ ఎటపాక మండల ఆఫీసర్లు హెచ్చరించడంతో పనులు ఆపేశారు. ఇప్పటికే కట్టిన వాటిని సిబ్బంది కూల్చివేశారు.