నిజామాబాద్లో ప్రభుత్వ భూముల ఆక్రమణ

నిజామాబాద్లో ప్రభుత్వ భూముల ఆక్రమణ
  • నిజామాబాద్ లో భూమాయ..30ఎకరాల ప్రభుత్వ భూమి హాంఫట్ 
  • నిజామాబాద్​సిటీలో భూమాయ
  • 272 ఎకరాల భారీ వెంచర్​లో అడుగడుగునా అక్రమాలు
  • 30 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూములు కబ్జా
  • బినామీలను ముందటపెట్టి బీఆర్ఎస్​ లీడర్ల బాగోతం
  • రైతులను భయపెట్టి తక్కువ రేట్లకు భూముల సేకరణ
  • డెవలప్ చేసిన ల్యాండ్​ను ‘నుడా’లో మార్టిగేజ్ చేసి కోట్లలో లోన్లు
  • అగ్రిమెంట్​ ప్రకారం రైతులకు డబ్బులివ్వకుండా సతాయింపు
  • భూములు ఇవ్వనివాళ్లకు ఇప్పటికీ బెదిరింపులు
  • వెంచర్​ రోడ్ల కోసం పదెకరాల గుట్టనూ పొతంబెట్టిన్రు
  • ఏకంగా రూ. 10 కోట్ల సర్కారు నిధులతో బ్రిడ్జీలు కట్టుకున్నరు
  • బీఆర్ఎస్​ కార్పొరేటర్​ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కలెక్టర్
  • సర్వేలో ఒక్కొక్కటిగా బయటపడ్తున్న దందాలు

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​ సిటీ శివారులో నాలుగేండ్ల కింద వెలిసిన ఓ భారీ రియల్​వెంచర్​అక్రమాల పుట్టలా మారింది. బీఆర్​ఎస్​ నేతలు నాడు అధికారాన్ని అడ్డుపెట్టుకొని 272 ఎకరాల్లో  వేసిన ఈ లేఅవుట్​లో అడ్డగోలుగా ఉల్లంఘనలు పాల్పడ్డట్టు తేలింది. 

డెవలప్​మెంట్​పేరుతో రైతులను బెదిరించి సేకరించిన భూములను నిజామాబాద్​అర్బన్​ డెవలప్​మెంట్​కార్పొరేషన్​(నుడా)లో మార్టిగేజ్​ చేసి  కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. భూములిచ్చిన రైతులకు మాత్రం అగ్రిమెంట్​ ప్రకారం చెల్లింపులు చేయకుండా ముప్పుతిప్పలు పెడ్తున్నారు. 

30 ఎకరాలకు పైగా ప్రభుత్వ, ఎండోమెంట్​భూములను కబ్జా చేసి వెంచర్​లో కలిపేసుకున్నారు. పదెకరాల గుట్టను పొతంపెట్టి రోడ్లేసుకున్నారు. ఏకంగా ప్రభుత్వ ఫండ్స్ నుంచి రూ.10 కోట్లతో రెండు బ్రిడ్జిలు నిర్మించారు..ఇట్ల ఈ భారీ వెంచర్​లో జరిగిన అక్రమాలకు అంతేలేదు. దీనిపై ఆఫీసర్లకు ఫిర్యాదులు అందడంతో ఇటీవలే సర్వే ప్రారంభించారు. 

డెవలప్​మెంట్​పద్ధతిలో ప్రారంభమై..!

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 2019లో 13 శివారు గ్రామాలు  విలీనమయ్యాయి. విలీన గ్రామాలైన మాణిక్​ భండార్, బోర్గాం(కె) పరిధిలోని కాలనీలతో 2వ డివిజన్ ఏర్పడింది. ఈ ప్రాంతంలో రియల్​ఎస్టేట్​ బిజినెస్​ పుంజుకుంటుందని కామారెడ్డి జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్​ లీడర్​ఒకరు వెంచర్​ వేయాలనుకున్నారు. 

నిజామాబాద్– ఆర్మూర్  రోడ్డులో  వెంచర్ ప్లాన్ చేసి స్థానికంగా ఉన్న  పరిచయాలతో  రైతులతో కలిసి మాట్లాడారు. భూములు కొనడంతో పాటు  డెవలప్​మెంట్​కింద అగ్రిమెంట్​ చేసుకోవడం మీద బీజేపీ నేత దృష్టి పెట్టారు. 

పట్టా భూములిచ్చిన  రైతులకు  డెవలప్ చేసిన ల్యాండ్ 72 శాతం ఇచ్చి..28 శాతం డెవలపర్​వాటాగా తీసుకునేలా అగ్రిమెంట్​చేసుకుని సుమారు 60 ఎకరాలు సేకరించారు. మరో 16 ఎకరాలను ఎకరానికి రూ.50 లక్షల చొప్పున రైతుల నుంచి కొన్నారు. లాభసాటిగా ఉండడంతో ఎక్కువ మంది రైతులు డెవలప్​మెంట్ అగ్రిమెంట్​ వైపు మొగ్గుచూపారు.  

బీఆర్ఎస్​ నేతల ఎంట్రీతో దందా షురూ!

గ్రామాల విలీనం పూర్తయ్యాక కొందరు బీఆర్ఎస్ పెద్ద లీడర్లు రంగప్రవేశం చేసి.. బీజేపీ నేత నుంచి భూములు కొనడంతో పాటు ఆయన అగ్రిమెంట్​ చేసుకున్న భూములకు గుడ్​విల్​ ఇచ్చి వాటిని కూడా తీసుకున్నారు. బీఆర్ఎస్​ లీడర్లు  వెంచర్​ను విస్తరించడానికి తమ చేతిలో ఉన్న అధికారాన్ని అడ్డంగా వాడుకున్నారు.

 నిజానికి ఈ ప్రాంతంలో ఎకరానికి రూ.60 లక్షల నుంచి 2 కోట్ల వరకు ధర ఉండగా పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లతో బెదిరించి తక్కువ రేటుకు కొనుగోలు చేశారనే ఆరోపణలున్నాయి. భూములు ఇచ్చేందుకు ఒప్పుకోని రైతులను పోలీస్​స్టేషన్​ పిలిపించి భయభ్రాంతులకు గురిచేశారని స్థానికంగా చర్చించుకుంటున్నారు. 

ఇలా రైతులను బెదిరించి తక్కువ రేటుకు ల్యాండ్​తీసుకోవడంతోపాటు  సర్కారు భూములను కూడా ఆక్రమించారు. పట్టా భూములను ఆనుకొని ఉన్న దేవుడి మాన్యం,  7 ఎకరాల ఇరిగేషన్ కెనాల్ ల్యాండ్, 12 ఎకరాల పచ్చలకుంట కట్ట, బండ్లబాట, అసైన్డ్ భూములు.. ఇట్ల మొత్తం 30 ఎకరాల దాకా కబ్జా చేసి వెంచర్​లో  కలిపేసుకున్నారు.

 దాదాపు 272 ఎకరాల్లో వెలిసిన ఈ వెంచర్​లో  రోడ్లు వేయడానికి మాక్లూర్ దగ్గర ఉన్న పదెకరాల చిన్నాపూర్ గుట్టను  మొత్తం ఊడ్చేశారు. వందలాది టిప్పర్లు, ప్రొక్లెయిన్లు రాత్రింబవళ్లు నడిపినా అప్పటి అధికారులెవరూ పట్టించుకోలేదు. 

రైతులకు డబ్బులిస్తలే.. 

మూడు నెలలకో కిస్తీ చొప్పున మూడు కిస్తుల్లో మొత్తం అమౌంట్​ ఇస్తామని రైతులతో అగ్రిమెంట్​ చేసుకున్న వెంచర్​ నిర్వాహకులు.. డబ్బులు చెల్లించకుండా ఇబంబందులు పెడ్తున్నారు. 23 మంది రైతులు మూడేండ్ల నుంచి వారి చుట్టూ తిరుగుతున్నారు. డెవలప్ మెంట్​కు ఇచ్చిన భూములకు సంబంధించి 73శాతం ల్యాండ్ వాటాను రైతుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ‘నుడా’లో మార్టిగేజ్ చేశారు. 

డెవలప్ చేసిన సుమారు 30 ఎకరా ల ల్యాండ్ రైతులకు రిజిస్ట్రర్ చేసినట్లే చేసి మార్టిగేజ్​ చేయ డంతో రైతులు ఓనర్​షిప్​కు దూరమై.. తమ భూములను అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారు. పైగా ఇప్పటికీ వెంచర్​ విస్తరణలో భాగంగా తమ భూములు ఇవ్వాలని బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సర్కారు ఫండ్స్​తో బ్రిడ్జీలు  

వెంచర్​కు వెళ్లడానికి అడ్డుగా ఉన్న వాగులపై ప్రభుత్వ నిధులతో రెండు బ్రిడ్జిలు నిర్మించారు. వీటికోసం తెలంగాణ అర్బన్​ ఫైనాన్స్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ డెవలప్​మెం ట్​ కార్పొరేషన్ నిధుల నుంచి రూ.10 కోట్లు 2022 అక్టోబర్​లో శాంక్షన్ చేయించుకున్నారు. రూ.6.5 ‌‌‌‌‌‌‌‌కోట్ల తో మాణిక్​ భండార్ వద్ద పులాంగ్​వాగుపై హైలెవెల్ బ్రిడ్జి, రూ.3.50 కోట్ల ఖర్చుతో గుండు వాగుపై మరో బ్రిడ్జి నిర్మించారు.

 బీఆర్ఎస్​ నేతల ఒత్తిడితో ఈ బ్రిడ్జి ల కోసం అప్పటి ఆఫీసర్లు చకాచకా ప్రతిపాదనలు పం పగా అంతే వేగంగా డబ్బులు రిలీజయ్యాయి. బీఆర్ఎస్​కు చెందిన పెద్ద లీడర్​ ఆధ్వర్యంలో ఐదుగురు పార్టీ లీడర్లు వెంచర్​ నిర్వహిస్తున్నారు. అగ్రిమెంట్​ చేసేటప్పుడు, రైతులతో డీల్​ చేసేటప్పుడు తప్ప వీరు ఎక్కడా కనిపించరు. మిగతా వ్యవహారాలు బినామీల ద్వారా నడిపిస్తున్నారు.

 గతంలో పెట్రోల్ బంక్​లో పనిచేసిన వ్యక్తి, పేకాట అడ్డాలు నడిపిన మరో వ్యక్తితో పాటు 25 మంది బినామీలు వెంచర్​ బాధ్యతలు చూస్తున్నారు. రియల్​ దందాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా రెవెన్యూ శాఖకు చెందిన యూనియన్ లీడర్ ఒకరు చూసుకుంటున్నట్టు తెలుస్తున్నది. 

ప్రభుత్వ పైసలతో  బ్రిడ్జిలు కట్టిన్రు..

మున్సిపల్ కార్పొరేషన్​లో శివారు గ్రామాల విలీనం తర్వాత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానన్న నమ్మకంతో  ప్రజలు నన్ను కార్పొరేటర్​గా గెలిపించారు.  కానీ, కొత్తగా ఏర్పడిన డివిజన్​లో చేయాల్సిన పనులను పక్కనపెట్టిన పెద్ద లీడర్లు.. అక్కడ ఖర్చు చేయాల్సిన సొమ్మును వెంచర్​లో ఖర్చుపెట్టారు. ప్రభుత్వ సొమ్ముతో బ్రిడ్జిలు కట్టారు.

 ఈ విషయం తెలిసి డివిజన్ ప్రజలు నన్ను నిలదీస్తుంటే సమాధానం చెప్పలేకపోతున్న. వెంచర్​లో 30 ఎకరాలకు మించి సర్కారు ల్యాండ్ ఆక్రమణకు గురైన వివరాలను సమాచార హక్కు చట్టం కింద సేకరించి కలెక్టర్​కు ఫిర్యాదు చేశాను. మలావత్ రాయ్​సింగ్​, 2వ డివిజన్ కార్పొరేటర్

భూమి ఇవ్వాలని సతాయిస్తున్నరు

వెంచర్​కు సమీపంలో నాకు  రెండెకరాల పట్టా భూమి ఉంది. పంటలు సాగు చేస్తూ కుటుం బాన్ని పోషించుకుం టున్నా.  నా భూమిని  వెంచర్​కోసం ఇవ్వాలంటూ గుర్తుతెలియని వ్యక్తులు తరచూ వచ్చి బెదిరిస్తున్నారు. కుదరదని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా దౌర్జన్యంగా వచ్చి కట్టెలు పాతి వెళ్తున్నారు.  ఏం చేస్తరోనని భయంగా ఉంది. అధికారులు, పోలీసులు మాకు అండగా నిలవాలి.

- నిజాముద్దీన్, రైతు, మాణిక్​భండార్​

కార్పొరేటర్ ఫిర్యాదుతో కదిలిన డొంక

వెంచర్​లో అడుగడుగునా జరిగిన ఉల్లంఘనలు, ప్రధానంగా ప్రభుత్వ భూముల కబ్జాలపై బీఆర్ఎస్​కే చెందిన కార్పొరేటర్ రాయ్​సింగ్​ ఆర్టీఐ కింద వివరాలు సేకరించి నేరుగా నిజామాబాద్​ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఫిర్యాదు చేశారు. దీంతో  కబ్జాలపై విచారణకు కలెక్టర్​ఆదేశించగా.. అక్రమాలు ఒక్కొక్కటి బయటపడ్తున్నాయి. 

రెవెన్యూ అధికారులు కొద్దిరోజుల కింద సర్వే ప్రారంభించగా.. సర్వే నంబర్ 474, 499, 503, 548 లో దేవాదాయ శాఖకు చెందిన 4.03 ఎకరాలు వెంచర్​లో ఉన్నట్టు గుర్తించి రాళ్లు పాతారు. వెంచర్ మొత్తాన్ని సర్వే చేసి,  ఎంత ప్రభుత్వ భూమి బయటపడ్తే అంత భూమికి హద్దు రాళ్లు పాతి సంరక్షిస్తామని రెవెన్యూ ఆఫీసర్లు చెప్తున్నారు. వెంచర్​లో కొత్తవాళ్లు ప్లాట్లు కొనుగోలు చేయొద్దని, ఎవరైనా భూములకోసం రైతులను బెదిరిస్తే తమ దృష్టికి తీసుకురావాలని వారు సూచిస్తున్నారు.