- 130 ఎకరాల కురుమూర్తి ఆలయ భూములకు ఎసరు
- తెర వెనుక బడా లీడర్లు, పట్టించుకోని ఆఫీసర్లు
- ఎకరానికి రూ.30 లక్షలు పలకడంతో భారీగా డిమాండ్
మహబూబ్‌నగర్/చిన్నచింతకుంట, వెలుగు : ఎండోమెంట్ భూములకు రక్షణ లేకుండా పోతోంది. తెలంగాణ తిరుపతిగా పేరుపొందిన కురుమూర్తి ఆలయానికి ధూప, దీప, నైవేద్యాల కోసం పూర్వం సంస్థానాధీశులు 350 ఎకరాలను కేటాయించగా, ప్రస్తుతం ఈ భూములు కోట్ల ధర పలుకుతున్నాయి. దీంతో కొందరు ఈ భూములపై కన్నేశారు. 130 ఎకరాలకు పైగా భూములు ఆక్రమించి, వ్యవసాయం చేసుకుంటున్నారు. కొంత కాలంగా ఈ వ్యవహారం నడుస్తున్నా.. ఆఫీసర్లు చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపూర్ గ్రామ శివారులో కురుమూర్తి టెంపుల్‌కు 350 ఎకరాల్లో మాన్యం భూములున్నాయి. ఈ భూములు కురుమూర్తి, గూడూరు, మద్దూరు, అమరచింత, చిన్నచింతకుంట, పళ్లమర్రి, లాల్కోట, కర్వేన, అల్లీపురం, అప్పంపల్లి, వడ్డేమాన్, తిర్మలాపురం, బండ్రవల్లి గ్రామాల పరిధిలోని 68 సర్వే నంబర్లలో ఉన్నాయి. 1952, 1954లో ఈ భూములను ఆలయంలో దేవుని సేవ చేస్తున్న వారికి కిద్మత్ ఇనాం(సర్వీసుదారులు) కింద ఇచ్చారు. అప్పటి నుంచి వీరు భూములు సాగు చేసుకుంటున్నారు. కొన్నేండ్ల కిందట వారు ఈ భూములను ఇతరులకు కౌలుకు ఇచ్చారు. కౌలుకు ఇచ్చిన తర్వాత కొందరు సేవకులు వివిధ కారణాలతో చనిపోయారు. అప్పటి నుంచి కౌలుకు తీసుకున్న వ్యక్తులు తిరిగి ఈ భూములను సర్వీసుదారులకు అప్పగించడం లేదు. ఈ విషయం గురించి సర్వీసుదారుల వారసులు ఎండోమెంట్ ఆఫీసర్లకు కంప్లైంట్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు.
ఆక్రమణలో 130 ఎకరాలు..
13 గ్రామాల్లో ఆలయ భూములు ఉండగా, అందులో నాలుగు గ్రామాల్లో 130 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు కురుమూర్తి ఆలయానికి చెందిన ఓ ఉద్యోగి తెలిపారు. ఇందులో ఒక్క లాల్కోట గ్రామ శివారులోని సర్వే నంబర్లలోని 30, 102, 108లలో 45.15 ఎకరాల భూములున్నాయి. అలాగే కురుమూర్తి గ్రామ శివారులోని సర్వే నంబర్ 274లో 32.4 ఎకరాలు, 277, 278లో 22 ఎకరాలు, బండ్రవల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 40, 46, 246/2, 248లో 16.19 ఎకరాలు, పళ్లమర్రి గ్రామ శివారులో దాదాపు 15 ఎకరాల భూమి ఆక్రమణలో ఉంది. ఇటీవల అమ్మాపూర్ గ్రామానికి చెందిన యువకులు కురుమూర్తి శివారులోని 17.4 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని తహసీల్దార్‌కు కంప్లైంట్ చేశారు. లాల్కోట గ్రామ శివారులో ఉన్న 45.15 ఎకరాల ఆలయ భూమి రెండేండ్ల కింద ఆక్రమణకు గురైనట్లు తెలుసుకున్న ఆఫీసర్లు పరిశీలించి అక్కడ బోర్డు ఏర్పాటు చేశారు. బోర్డు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్న ఆఫీసర్లు, ఆ తర్వాత ఈ భూముల వైపు తిరిగి చూడలేదు. ఆక్రమణదారుల్లో కొందరు బడా లీడర్ అనుచరులు ఉండడంతో ఆ భూముల జోలికి ఆఫీసర్లు వెళ్లడం లేదనే ఆరోపణలున్నాయి. రోడ్డు పక్కన ఉండే పొలాల విలువ ఎకరాకు రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షలు పలుకుతోంది. సెకండ్ బిట్, థర్డ్ బిట్లో ఉన్న భూముల ధర ఎకరం రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఉంది. ప్రస్తుతం కబ్జాకు గురైన భూములు రోడ్డు నుంచి కొంత దూరంలో ఉండగా, వీటి విలువ దాదాపు రూ.40 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇదిలాఉంటే కురుమూర్తి జాతర సమయంలో హడావుడి చేసే పాలకమండలి కురుమూర్తి గుట్టల నుంచి మట్టిని తవ్వుతున్నా స్పందించలేదు. క్వారీ కోసం పెద్ద ఎత్తున బ్లాస్టింగ్లు చేస్తుండడంతో గర్భగుడికి ప్రమాదం పొంచి ఉన్నా నోరు మెదపలేదు. వందలాది ఎకరాల ఆలయ భూములు ఆక్రమణకు గురైనా పట్టించుకోవడం లేదని అంటున్నారు.
చిన్నచింతకుంట మండలం లాల్కోట గ్రామ శివారులో కురుమూర్తి టెంపుల్‌కు సంబంధించి సర్వే నంబర్ 26, 30, 102, 108లలో 45.15 ఎకరాల భూమి ఉంది. ఈ భూములు ఎకరా రూ.30 లక్షల వరకు పలుకుతున్నాయి. దీంతో కొంత కాలం కిందట లాల్కోట గ్రామానికి చెందిన ఎనిమిది మంది వీటిని ఆక్రమించారు. విషయం తెలుసుకున్న ఎండోమెంట్ ఆఫీసర్లు ఇది ఆలయ భూమి అని బోర్డును ఏర్పాటు చేశారు. కానీ, ఇంత ఆక్రమణలో ఉన్న వారిపై చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం ఆక్రమించిన భూమిలో వరి సాగు చేస్తున్నారు.
తిరిగి స్వాధీనం చేసుకుంటాం..
కురుమూర్తి ఆలయ భూములు ఆక్రమణకు గురవుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో సర్వేయర్ల ద్వారా బౌండరీలను ఏర్పాటు చేస్తాం. ఆలయ భూములు ఆక్రమణకు గురవుతున్నట్లు మా దృష్టికి తెస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
- మదనేశ్వర్‌రెడ్డి, కురుమూర్తి ఆలయ ఈవో