- జిల్లాకేంద్రాలతోపాటు మున్సిపాలిటీలకూ వరద ముంపు
రాజన్నసిరిసిల్ల, వెలుగు: చెరువుల ఆక్రమణలు, నాలాల కబ్జాలే పట్టణాలను ఆగం చేస్తున్నాయి. ప్రతి ఏటా వర్షాలు పెరుగుతుండగా.. ఒక్కసారిగా వస్తున్న వరదలతో జనజీవనం స్తంభిస్తోంది. చిన్నపాటి వానకే సిరిసిల్ల ఏటా నీటమునుగుతోంది. పాత బస్టాండ్ ప్రాంతంతోపాటు సంజీవయ్యనగర్, శాంతినగర్, శ్రీనగర్, అనంత్ నగర్, వెంకంపేట కాలనీలు నీటమునిగుతున్నాయి.
కబ్జా కోరల్లో చెరువులు
- సిరిసిల్ల ముంపునకు చెరువుల కబ్జానే కారణం. పట్టణంలోని కొత్త చెరువు, కార్గిల్ లేక్ మినహా మిగతా చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయి. ఆధునీకీకరణ పేరుతో కొత్త చెరువును సగం పూడ్చారు. మత్తడి కబ్జాకు గురైంది. వాన పడినప్పుడల్లా రాజీవ్‌నగర్, జేపీ నగర్, ముష్టిపల్లి, చంద్రంపేట పరిసరాల నుంచి వచ్చే వరద.. కొత్త చెరువులోకి చేరుతుండగా.. నిల్వ సామర్థ్యం తగ్గిపోవడంతో సమీపంలోని శాంతినగర్, శ్రీనగర్ కాలనీలను వరద ముంచుతోంది. ఈ వరద పాత బస్టాండ్ వరకు నిలుస్తోంది.
- చంద్రంపేట ఈదుల చెరువు శిఖం భూమి రాజీవ్‌నగర్ వరకు విస్తరించి ఉంది. ఈ భూమిలో వందలాది మంది అక్రమంగా ఇండ్లు నిర్మించుకున్నారు. బీవైనగర్‌లో ఉన్న రాయిని చెరువు, పెద్దూరు ఎద్దుల మైసమ్మ వద్ద ఉన్న దేవునికుంట, సంజీవయ్యనగర్ వెనుకభాగంలోని మైసమ్మ కుంట, బైపాస్ కింద ఉన్న దామెర కుంట, సిరిసిల్ల ఫిల్టర్ బెడ్ వద్ద ఉన్న తుమ్మల కుంట, కార్గిల్ లేఖ్ వద్ద ఉన్న వర్థని కుంట కొంత భాగం కబ్జాకు గురైనట్లు పట్టణవాసులు ఆరోపిస్తున్నారు.
- వేములవాడ మూలవాగు ఒడ్డున కబ్జాలు జరిగినట్లు మున్సిపల్ అధికారులు గుర్తించారు. వీటిని గతంలో కూల్చే ప్రయత్నం జరిగినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతోపాటు, కబ్జాదారులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడంతో కూల్చివేతలు ఆగిపోయాయి. శామకుంట వద్ద ఆక్రమణలు జరిగినట్టు మున్సిపల్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఈఆక్రమణలతో మూలవాగు ఉధృతి పెరిగినప్పుడల్లా వేములవాడ లోతట్టు కాలనీలు జలమయమవుతున్నాయి.
మునుగుతున్న పట్టణాలు
జగిత్యాల, వెలుగు: చెరువు, వాగులు, నాలాల ఆక్రమణలతో జగిత్యాల జిల్లాకు వరద ముప్పు తప్పడం లేదు. ముఖ్యంగా మున్సిపాలిటీల్లోని భూముల ధరలు పెరగడంతో ఆయా పట్టణాల్లోని చెరువు శిఖం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతో వరద నీరు చెరువుల్లోకి పోయే మార్గం లేకపోవడం, నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడంతో పలు కాలనీలు నీట మునుగుతున్నాయి. మరోవైపు గొలుసుకట్టు చెరువులకు సంబంధించిన వాగులు, నాలాలు కబ్జాకు గురవడంతో శివారు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద నీరు చేరుతోంది.
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలు ఉన్నాయి.
జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న మోతె, అంతర్గాం, చింతకుంట, కండ్లపల్లి, గోవింద్ పల్లె గొలుసుకట్టు చెరువులు ఉండడంతో జగిత్యాలను ‘ఫైవ్ పాండ్స్ సిటీ’ గా పిలుస్తారు. వీటిలో ప్రధాన చెరువైన మోతె చెరువు కబ్జాలకు గురై 80 ఫీట్లు ఉన్న కెనాల్స్ 20-–30 ఫీట్లకు తగ్గిపోయాయి. దీనివల్ల భారీ వర్షాలతో గోవింద్‌పల్లె బ్రిడ్జి మునిగి వెంకటాద్రి నగర్‌కు రాకపోకలు తెగిపోతున్నాయి. మోతె చెరువులోని ఎఫ్టీఎల్ పరిధిలో 300కు పైగా అక్రమంగా ఇండ్లు నిర్మించారు. కోరుట్ల పట్టణ శివారులోని కంచర కుంటలో నిండిన నీరు ఐలాపూర్ చెరువు , మద్దుల చెరువుకు పిల్ల కాల్వల ద్వారా వెళ్తుండేది. ప్రస్తుతం ఆ కాల్వలు కబ్జాకు గురవడంతో కంచరకుంట మత్తడి నీరు, మద్దుల చెరువు ద్వారా ప్రకాశం రోడ్డు, ఝాన్సీ రోడ్డు , కల్లూరు రోడ్డులోని లోతట్టు ప్రాంతాలను ముంచుతోంది. అలాగే రాయికల్ బల్టియా పరిధిలోని చెరువు బఫర్‌జోన్ ప్రాంతంలో ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇవ్వడంతో పాత వాడకట్టు లో ఇండ్లలోకి వర్షం నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.