జగిత్యాలలో ఎస్సారెస్పీ భూములు కబ్జా

జగిత్యాలలో ఎస్సారెస్పీ భూములు కబ్జా
  • 200 ఎకరాల్లో సుమారు 10 ఎకరాల వరకు కబ్జా 
  • సర్వే నంబర్ 347, 348ల్లోనే కబ్జాలు 
  • అక్రమంగా వెలిసిన షెడ్లు
  • సర్వే చేయాలని స్థానికుల డిమాండ్​

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్సారెస్పీ భూములు కబ్జాలకు గురవుతున్నాయి. ఎస్సారెస్పీ నిర్మాణ సమయంలో వివిధ ఆఫీసుల కోసం ధరూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాంపు ఏరియాలో రైతుల నుంచి భూములు సేకరించి నిర్మాణాలు చేపట్టారు. ఆ తర్వాత చాలా వరకు భూమి నిరుపయోగంగా ఉండగా.. భూముల ధరలకు రెక్కలు రావడంతో అక్రమార్కుల కన్ను వీటిపై పడ్డాయి. ధరూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాంపు ఏరియాలోని 200 ఎకరాల ఎస్సారెస్పీ ల్యాండ్స్‌‌‌‌‌‌‌‌ ఉండగా.. 10 ఎకరాల వరకు కబ్జాకు గురయ్యాయి. ఈ భూములకు సర్వే చేపట్టాలని స్థానికులు డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. 

సరిహద్దులు దాటి ఆక్రమణలు

1979 లెక్కల ప్రకారం జగిత్యాల ఎస్సారెస్పీ క్యాంప్ లో దాదాపు 200 ఎకరాలకు పైగా భూములు ఉండేవి. వీటిలో ప్రైమ్ లోకేషన్లలో ఉన్న సర్వే నెంబర్ 347,  348లోని ఎస్సారెస్పీ భూముల్లో చేపట్టిన కొన్ని నిర్మాణాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ సర్వే నెంబర్లలోని ఎస్సారెస్పీ భూములను ఆనుకొని ఉన్న ఓ అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ నిర్మాణంలో అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. సుమారు 3 గుంటల ఎస్సారెస్పీ స్థలాన్ని ఆక్రమించి ఈ అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను కట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 సొంత భూములు ఉన్న కొందరు ఇండ్ల నిర్మాణాల పేరుతో పక్కనే ఉన్న ఎస్సారెస్పీ భూముల్లోకి హద్దులు దాటి  నిర్మాణాలను చేపడుతున్నారు.  మరి కొందరైతే ఏకంగా సర్వే నంబర్ 347లోన షెడ్లు ఏర్పాటు చేసి దర్జాగా కబ్జాకు పాల్పడుతున్నారు. పైగా తమ అక్రమ షెడ్లకు పర్మిషన్లు ఉన్నాయని బాహాటంగానే చెబుతున్నారు. కాగా షెడ్లు, అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లు నిర్మిస్తున్నా బల్దియా ఆఫీసర్లు అడ్డుకోకపోవడంపై అనుమానాలకు తావిస్తోంది. ఇలా దాదాపు 10 ఎకరాలకుపైగా కబ్జా అయినట్లు తెలుస్తోంది. వీటి విలువ ప్రస్తుత మార్కెట్‌‌‌‌‌‌‌‌లో రూ. 10 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

సర్వే చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ 

ధరూర్ క్యాంప్‌‌‌‌‌‌‌‌ ఏరియాలో కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, ఇతర ప్రభుత్వ ఆఫీసులు ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం ప్రైమ్ లొకేషన్ గా మారింది. ఎస్సారెస్పీ క్యాంప్‌‌‌‌‌‌‌‌లో క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌ స్థలాలు మినహా ప్రాజెక్ట్ కోసం సేకరించిన భూమిని సర్వే చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అప్పుడే కబ్జాలు బయటపడతాయని స్థానికులు వాపోతున్నారు. ఈ మేరకు సర్వే చేపట్టి హద్దులు ఏర్పాటు చేస్తే అక్రమణలపై చర్యలు తీసుకోవడమే కాకుండా భవిష్యత్తు అవసరాలకు ఎస్సారెస్పీ భూమిని కాపాడుకునే అవకాశం ఉందని జిల్లా వాసులు కోరుతున్నారు.

కబ్జాలపై చర్యలు తీసుకుంటాం 

కబ్జాకు గురైన భూములను రెవెన్యూ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ గుర్తించాల్సి ఉంటుంది. ఇటీవల ఎస్సారెస్పీ భూమిలో అక్రమ నిర్మాణానికి గతంలోనే నోటీస్​జారీ చేశాం. ఈ అంశం కోర్టు పరిధి ఉంది. అలాగే అక్రమంగా వేసిన షెడ్డును కూల్చి వేయాలని సంబంధిత మున్సిపల్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశాం. ఎస్సారెస్పీ సబ్ కెనాల్స్ కూడా మూసి వేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. వాటిపైనా చర్యలు తీసుకుంటాం.  వాజిద్ అలీ, డీఈ ఎస్సారెస్పీ