- నస్పూర్‌లోని 42 సర్వే నంబర్లో 25 గుంటలు ఎన్‌క్రోచ్‌మెంట్
మంచిర్యాల, వెలుగు: నస్పూర్ మున్సిపాలిటీ పరిధి 42 సర్వేనంబర్‌లోని ప్రభుత్వ భూమిలో వెలిసిన ఆక్రమణలను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు మంగళవారం పోలీస్ బందోబస్తు నడుమ తొలగించారు. నస్పూర్‌కు చెందిన గోపాల్రావుకు 40 సర్వేనంబర్‌లో 3 ఎకరాలకు పైగా భూమి ఉంది. అందులో ఫంక్షన్ హాల్ నిర్మాణానికి పర్మిషన్ కోసం మున్సిపాలిటీలో అప్లై చేశాడు.
సదరు భూమి హద్దుల నిర్ధారణ కోసం మున్సిపల్ కమిషనర్ సతీశ్ తహసీల్దార్ శ్రీనివాస్‌కు లెటర్ రాశారు. గోపాల్రావుకు 40 సర్వేనంబర్‌లో భూమి ఉండగా, పక్కనే ఉన్న 42 సర్వే నంబర్లో సుమారు 25 గుంటలు ఎన్‌క్రోచ్‌మెంట్ చేసినట్టు గుర్తించారు. దీంతో అక్కడ ఏర్పాటు చేసిన కాంపౌండ్‌ను జేసీబీలతో తొలగించారు.
అయితే ఫంక్షన్‌హాల్ పర్మిషన్ కోసం మున్సిపల్ కమిషనర్ సతీశ్ రూ.14 లక్షలు డిమాండ్ చేశాడని, ఆ పైసలు ఇవ్వకపోడంతో రెవెన్యూ అధికారులను ఉసిగొల్పి సర్వే చేయకుండానే కాంపౌండ్ కూల్చేశారని గోపాల్‌రావు ఆరోపించారు. గవర్నమెంట్ ల్యాండ్ ఎన్‌క్రోచ్‌మెంట్ చేయడం వల్లే ఫంక్షన్ హాల్‌కు పర్మిషన్ ఇవ్వలేదనే అక్కసుతోనే తనపై ఆరోపణలు చేస్తున్నాడని మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు.
పైసల వ్యవహారంతో తనకు సంబంధం లేదని తహసీల్దార్ శ్రీనివాస్ అన్నారు. అయితే రెవెన్యూ, మున్సిపల్ అధికారుల అలసత్వం కారణంగా 42 సర్వేనంబర్‌లోని కోట్ల విలువైన భూములు కబ్జా అవుతున్నాయి. గోపాల్రావుపై ఎప్పటినుంచో భూకబ్జా ఆరోపణలున్నాయి.