- అబూజ్మాఢ్ఎన్ కౌంటర్లో మృతి
- 33 ఏండ్లుగా అరణ్యంలోనే... బెల్లంపల్లిలో విషాదం
బెల్లంపల్లి, వెలుగు: అబూజ్ మాఢ్ అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కన్నాలబస్తీకి చెందిన మావోయిస్ట్ లీడర్ కాసరవేణి రవి అలియాస్ అశోక్ అలియాస్ విజయ్ చనిపోవడంతో విషాదం నెలకొంది. సింగరేణి కార్మికుడైన కాసరవేణి రాజయ్య-, లక్ష్మి దంపతులకు నలుగురు సంతానం కాగా, చిన్న కొడుకైన రవి బెల్లంపల్లిలోని టేకులబస్తీ జడ్పీ హైస్కూల్ లో పదవ తరగతి వరకు చదువుకున్నాడు. 1991లో సికాస (సింగరేణి కార్మిక సమాఖ్య)లో చేరి..నాటి సికాస డీసీఎం గెల్లి రాజలింగు అలియాస్ సురేశ్‌తో కలిసి కార్మిక సమస్యలపై ఉద్యమించారు. 33 ఏండ్ల కింద దండకారణ్యానికి వెళ్లి పూర్తి కాలపు కార్యకర్తగా చేరాడు. పార్టీలో ఆర్ఎంపీ డాక్టర్‌గా ప్రస్థానం మొదలుపెట్టిన అంచలంచెలుగా డీసీఎం స్థాయికి ఎదిగాడు. మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న రవి అనేక ఎన్ కౌంటర్ల నుంచి తప్పించుకున్నాడు. వెళ్లిననాటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఇంటి ముఖం చూడలేదు. రవి తల్లిదండ్రులు గతంలోనే చనిపోగా, పోలీసుల వేధింపులు భరించలేక రవి సోదరులు తిరుపతి, వెంకటేశ్, అక్క ఆల్య బెల్లంపల్లిని విడిచి సిద్దిపేట జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరకు వెళ్లిపోయారు. భౌతికకాయాన్ని వంగరకు తీసుకువచ్చేందుకు అమరుల బంధుమిత్రుల కమిటీ ప్రయత్నిస్తోంది.
మిగిలింది నలుగురే...
ఇప్పటి వరకు జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో 55 మంది బెల్లంపల్లివాసులు అమరులయ్యారు. గత ఏడాది జులైలో మావోయిస్ట్ పార్టీ పొలిట్‌బ్యూరో మెంబర్ కటకం సుదర్శన్ అనారోగ్యంతో దండకారణ్యంలోనే అసువులు బాశారు. ఈయన 45 ఏండ్లు పార్టీకి సేవ చేశారు. మావోయిస్ట్ అగ్ర నేతలు గజ్జెల గంగారాం,పెద్ది శంకర్, గజ్జెల సరోజన వివిధ కారణాలతో విప్లవోద్యమంలోనే అమరులయ్యారు. దీంతో ఇంకా దండకారణ్యంలో బెల్లంపల్లికి చెందిన నలుగురు మాత్రమే మిగిలిఉన్నట్టు పోలీసు రికార్డులు వెల్లడిస్తున్నాయి. మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ నాయకురాలు సలాకుల సరోజన, మావోయిస్టులు జాడి వెంకటి, ఆవుల బాలమల్లు అలియాస్ పుష్ప, ఆరెపల్లి కృష్ణ పార్టీలో వివిధ హోదాల్లో పని చేస్తున్నారు.