నేను తప్పు చేయలేదు.. నా బిడ్డకు తండ్రి సుభాష్: దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్

ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్ శాంతిపై ఆమె భర్త చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. 'నా భార్య అక్రమసంతానానికి తండ్రెవరో తేల్చండి..' అంటూ అసిస్టెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు వైసీపీ నేత విజయసాయిరెడ్డి, ప్రభుత్వ ప్లీడర్‌ సుభాష్‌లే కారణమని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూసింది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ అసిస్టెంట్ కమిషనర్ శాంతి మీడియా ముందుకొచ్చింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తన బిడ్డకు తండ్రి సుభాష్‌ అనే వ్యక్తి అని వెల్లడించింది. తాను లా చదువుకునే సమయంలో 2013, నవంబర్ లో మానిపాటి మదన్‌ మోహన్‌ తో పెళ్లయ్యిందని తెలిపిన శాంతి.. 2016లో తాము పరస్పర అంగీకారంతో విడిపోయినట్లు విడాకుల పత్రం రాసుకున్నట్లు వివరించింది. తమ వివాహ బంధానికి గుర్తుగా 2015, ఏప్రిల్ లో కవల పిల్లలు జన్మించారని తెలిపింది. పెళ్ళైన కొన్నాళ్లకు మదన్‌ మోహన్‌ తనను హింసించడం మొదలు పెట్టారని. ఆ బాధ, మానసిక వేదన భరించలేక అతనితో విడిపోయినట్లు పేర్కొంది. 

ఇది జరిగిన కొన్నాళ్ల అనంతరం 2019లో మదన్‌ మోహన్‌ విదేశాలకు వెళ్లిపోయారని తెలిపింది. ఇదిలావుండగానే, సుభాష్‌ అనే వ్యక్తితో పరిచయం అయినట్లు పేర్కొంది. ఆ పరిచయం ఇష్టంగా దారితీసి, అతన్ని పెళ్లాడానని వెల్లడించింది. తన గర్భానికి కారణం తన భర్త సుభాష్ అని మీడియా ముఖంగా తెలిపింది. తనకు మరొకరితో పెళ్లి అయినప్పటికీ, మదన్ తనను వేధిస్తుండేవాడని వాపోయింది. డబ్బు కోసమే మదన్‌ మోహన్‌ ఇలాంటి ఆరోపణలు సృష్టించాడని విమర్శించింది. వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని తెలిపింది. ఇదొక రాజకీయ కుట్ర అని ఆరోపించింది. తాను తక్కువ కులానికి చెందిన మహిళ కావడం వల్లే ఇలాంటి ఆరోపణలు చేశారని వాపోయింది.

కాగా, శాంతిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆమెను అసిస్టెంట్ కమిషనర్ బాధ్యతల నుంచి సస్పెండ్ చేస్తూ ఏపీ దేవాదాయ శాఖ ఉత్తర్వులిచ్చింది.