- పెండింగ్ పనులను త్వరగా కంప్లీట్ చేయండి
- దేవాదాయ కమిషనర్ శ్రీధర్ వెల్లడి
మహదేవ్పూర్,వెలుగు : మహా కుంభాభిషేకం, సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. వచ్చే నెలలో జరిగే మహా కుంభాభిషేకం, మే నెలలో సరస్వతి పుష్కరాలను సక్సెస్ చేసేందుకు భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం కాళేశ్వరంలో శుక్రవారం పర్యటించారు. అంతకుముందు కుటుంబ సభ్యులతో కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ అభివృద్ధి పనులపై ఈవో మారుతిని వివరాలు అడిగి తెలుసుకుని.. అనంతరం లైన్ డిపార్ట్ మెంట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. వచ్చే నెల 7 నుంచి 9 వరకు మహా కుంభాభిషేకం నిర్వహిస్తుండగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారన్నారు. రాజగోపురంపైన ఒకేసారి 20 మంది వరకు నిల్చోడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు.
మే నెలలో నిర్వహించే సరస్వతి పుష్కరాలకు 19 లైన్ డిపార్ట్ మెంట్ల ద్వారా ఏర్పాట్లు చేస్తామని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, చత్తీస్ గడ్ నుంచి వేలల్లో భక్తులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అందుకు అనుగుణంగా పార్కింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రధాన రహదారిలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ ద్వారా అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్సులు, వైద్య ఆరోగ్య శాఖ మెడికల్ క్యాంపులు, అంబులెన్స్ లు ఏర్పాటు చేయాలన్నారు.
సురక్షిత మంచి నీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, మహిళలు బట్టలు మార్చుకునేందుకు కొన్ని శాశ్వత గదులతో పాటు తాత్కాలిక గదులను ఏర్పాటు చేయాలన్నారు. కుంభాభిషేకానికి వస్తానని, అప్పటిలోపు పనులు పూర్తి కావాలని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, దేవాలయ ఈఓ మారుతి, రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, డివిజనల్ పంచాయతీ అధికారి వీరభద్రయ్య,దేవాదాయ శాఖ పరకాల డివిజన్ ఇన్ స్పెక్టర్ కవిత, ఇతర అధికారులు పాల్గొన్నారు.