భద్రాచలం,వెలుగు : రానున్న శ్రీరామ నవమికి భద్రాచలంలో నిర్వహించే నవమి ఉత్సవ ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్ సూచించారు. సోమవారం ఆయన ఆలయాన్ని సందర్శించి, అధికారులతో మాట్లాడారు. ఈ శ్రీరామ నవమికి సీఎం రేవంత్ వచ్చే అవకాశాలుంటాయని, వారితో పాటు వీవీపీలు రావొచ్చని చెప్పారు.
అలాగే కల్యాణ వేడుకలను చూసేందుకు దేశవ్యాప్తంగా భక్తులు వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. అలాగే మిథిలా స్టేడియంలో కల్యాణ వేదిక చుట్టూ ఉన్న కంచెను ఆయన పరిశీలించారు. కంచె వల్ల భక్తులకు కలిగే ఇబ్బందులు, సెక్యూరిటీ వివరాలను ఆరా తీశారు. ఇబ్బందులు లేకుంటే కంచెను తొలగించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
అనంతరం నిత్యాన్నదాన సత్రం, అంబసత్రం, గోశాల, జానకీ సదనంలను ఆయన తనిఖీ చేశారు. దుమ్ముగూడెం మండలం పర్ణశాల శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంను కూడా ఆయన సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ మల్లిఖార్జున రెడ్డి, ఈఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.