కొడిమ్యాల, వెలుగు: కొండగట్టు ఈవోగా శ్రీకాంతరావును నియమిస్తూ ఎండోమెంట్ కమిషనర్ శ్రీధర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన వరంగల్ ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా వారం రోజులగా కొండగట్టు ఈవో నియామకం వివాదాస్పదంగా మారింది. గతంలో పనిచేసిన రామకృష్ణారావు బదిలీపై హైదరాబాద్ వెళ్లగా ఎండోమెంట్ కమిషనర్ వేములవాడ ఈవో వినోద్‌కు కొండగట్టు ఈవోగా బాధ్యతలు అప్పజెప్పారు.
శనివారం ఆయన బాధ్యతలు కూడా స్వీకరించారు. ఇదే సమయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి శ్రీకాంత్ రావును కొండగట్టు ఈవోగా బదిలీ చేస్తున్నట్లు జీవో విడుదల అయింది. తాజాగా మంగళవారం మరోసారి కమిషనర్ నుంచి శ్రీకాంత్ రావు కొండగట్టు ఈవోగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ క్రమంలో ఈవోగా బాధ్యతలు ఎవరు నిర్వహిస్తారనే విషయంపై గందరగోళం నెలకొంది.