కొండగట్టు, వేములవాడ, వెలుగు: ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్ శుక్రవారం కొండగట్టు, వేములవాడ ఆలయాలను సందర్శించారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శుక్రవారం రాత్రి వేములవాడలో రాజరాజేశ్వర స్వామి వారి దర్శించుకున్నారు. ఆలయ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. వేసవి కావడంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం కొండగట్టులో పర్యటించిన ఆయన వివిధ పనులను పరిశీలించారు. క్వాలిటీతో పనులు చేయించాలని ఈవో వెంకటేష్ కు సూచించారు. గుట్టపైన నూతనంగా నిర్మిస్తున్న మాల విరమణ మండపం పూర్తి కాకముందే కాంట్రాక్టర్ కు రూ.36 లక్షల బిల్లు చెల్లించడం పైన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. టెంపుల్ రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ తిరుపతి రెడ్డి, సూపరింటెండెంట్ సునీల్ పాల్గొన్నారు. వేములవాడ ఆలయ ఈఈ రాజేశ్, డీఈ రఘునందర్ తదితరులు పాల్గొన్నారు.
అధికారుల అత్యుత్సాహం...
కమిషనర్ కొండగట్టు పర్యటనలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కొత్త కొనేరులో నీటిని నింపి కమిషనర్ నే తప్పుదోవ పట్టించారు. కొత్తగా సూచిక బోర్డులు, హనుమాన్ లాకేట్ అమ్మే కౌంటర్, ఆలయ ముఖ ద్వారంలో నీటి నల్లాలు ఏర్పాటు చేశారు. ఎప్పుడు లేనివిధంగా అధికారులు ఏర్పాట్లు చేయడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి రోజు ఇలాంటి సదుపాయాలు ఉండాలని కోరుతున్నారు.