హైదరాబాద్ , వెలుగు : రాష్రంలో దేవాలయాలకు ఉన్న మాన్యాలు, భూములను పరిరక్షించాలని, రెవెన్యూ శాఖతో కలిసి వాటికి హద్దులు ఏర్పాటు చేయాలని అధికారులను ఎండో మెంట్ డైరెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. ఆక్రమణలకు గురైన భూములను రెవెన్యూ శాఖ అధికారుల సహాయంతో స్వాధీన పరుచుకోవాలని సూచించారు. న్యాయస్థానాల్లో ఉన్న దేవాలయ భూములకు సంబంధించి తగిన కౌంటర్లు దాఖలు చేయాలన్నారు. బుధవారం ఎండోమెంట్ కమిషనరేట్ లో అధికారులు, పలు టెంపుల్స్ ఈవోలతో ఆయన రివ్యూ చేపట్టారు. సెలవుల్లో పెద్ద సంఖ్యలో భక్తులు టెంపుల్స్ ను సందర్శిస్తారని, ఎండలు అధికంగా ఉన్నందున షెడ్లు, చలి వేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ALSO READ ; దేశ బడ్జెట్లో 15% విద్యకు కేటాయించాలి: తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ
ప్రధానంగా సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని, అన్నిరకాల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రసాదాల తయారీలో నాణ్యత పాటించాలన్నారు. దేవాలయాలకు సంబంధించిన ఆదాయ, వ్యయాల లెక్కలు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అన్నారు. దేవాలయ అర్చకులు, పూజారులు, కింది స్థాయి సిబ్బంది సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతివారం తమ కార్యాలయ అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి ఆలయంలో ఆ ఆలయ చరిత్ర, ప్రశస్తిని తెలిపే సమాచారంతో కూడిన బోర్డులను ప్రదర్శించాలని సూచించారు. సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.