ఎకో టూరిజం పాలసీ తెస్తాం : కొండా సురేఖ

ఎకో టూరిజం పాలసీ తెస్తాం : కొండా సురేఖ
  • రాష్ట్రంలో 12 ప్రాంతాలను ఎకో టూరిజం కేంద్రాలుగా చేస్తాం: కొండా సురేఖ  
  • పారదర్శకంగా ఆన్ లైన్ లో అటవీ అనుమతులు 
  • బొటానికల్ గార్డెన్ లో సీఎంతో కలిసి 75 థీమ్ పార్కులను సందర్శించిన మంత్రి 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో ప్రత్యేక ఎకో– టూరిజం పాలసీని తీసుకొస్తామని దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. రాష్ట్రంలోని 12 ప్రముఖ ప్రాంతాలను ఎకో– టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. బుధవారం కొండాపూర్​లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్ లో 75  థీమ్ పార్కులను సీఎం రేవంత్​రెడ్డితో కలిసి మంత్రి సురేఖ సందర్శించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్, ఎకో టూరిజం డెవలప్ మెంట్ ఆఫీస్ కు శంకుస్థాపన చేయడంతోపాటు కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి డివిజన్​ మేనేజర్ ఆఫీస్ కాంప్లెక్స్ లను వర్చువల్ గా ప్రారంభించారు. 

వైల్డ్ లైఫ్ సఫారీ పార్కులో భాగంగా గార్డియన్స్ ఆఫ్ ది వైల్డ్, జంగిల్ ఒడిస్సీ 9డీ సినిమా, 360 డిగ్రీ థియేటర్, వీఆర్ఎక్స్ పీరియన్స్ జూలను కూడా వర్చువల్​గా ప్రారంభించారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి సురేఖ పార్కులో మొక్కలు నాటారు. ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కొత్త వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వేదికపై అటవీశాఖ విజయాలను మంత్రి వివరించారు. 

పరిహారం రూ. 5 లక్షలు పెంపు..   

వన్యప్రాణుల దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. వన్యప్రాణుల వేట, జంతువుల అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు ‘క్యాచ్ ది ట్రాప్’ పేరుతో అటవీశాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. తు అటవీ అనుమతులను పారదర్శకంగా ఆన్​లైన్​లో ఇస్తున్నామని, ఇప్పటివరకు 22,954 పర్మిషన్లు ఇచ్చామన్నారు. ఆక్రమణకు గురైన17,643.30 ఎకరాల అటవీ భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

 తెలంగాణ హరితనిధి నుంచి రూ. 40.67 కోట్లతో12 ప్రాజెక్టులు చేపట్టామన్నారు. నగర వన యోజనలో భాగంగా రూ.18.90 కోట్లతో నగరాల్లో పచ్చదనం పెంచుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో టీజీఎఫ్​డీసీ కార్పొరేషన్ ​చైర్మన్ పొదెం వీరయ్య, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, సీఎం సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

టెంపుల్స్ అభివృద్ధికి రూ. 400 కోట్లు

గత బీఆర్ఎస్​ప్రభుత్వం దేవాలయాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి సురేఖ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి ఇప్పటికే రూ.400 కోట్లు మంజూరు చేసిందన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ సాధించిన వార్షిక ప్రగతి నివేదికను బుధవారం హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మీ సేవ, టీ యాప్ ద్వారా ఆలయ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. 

వేములవాడ, భద్రాచలం ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించామని.. భద్రాచలం, బాసర, అలంపూర్ జోగులాంబ ఆలయాల్లో నదీ హారతిని చేపట్టామని తెలిపారు. 33 మంది జూనియర్ అసిస్టెంట్లకు గ్రేడ్-3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పించామన్నారు. దేవాదాయ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్ల కోసం ఇందిరా మహిళా శక్తి గ్రూపులతో ఎంఓయూ కుదర్చుకున్నట్లు చెప్పారు. పర్యాటకశాఖతో అనుసంధానమై 3 టెంపుల్ టూరిజం సర్క్యూట్‌‌‌‌‌‌‌‌లను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.