
కేసముద్రం (మహబూబాబాద్ అర్బన్), వెలుగు: ఫెయిల్ అవుతాననే భయంతో రిజల్ట్స్ రాకముందే సూసైడ్ చేసుకున్న ఇంటర్స్టూడెంట్ 892 మార్కులతో ‘ఏ’ గ్రేడ్‌లో పాసయ్యాడు. ఈ ఘటన మృతుడి కుటుంబ సభ్యులను తీవ్ర వేదనకు గురిచేసింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడగుట్ట తండాకు చెందిన గుగులోతు లచ్చు, జ్యోతి దంపతుల పెద్ద కొడుకు కృష్ణ (19) ఏటూరు నాగారంలోని గిరిజన గురుకుల కాలేజీలో ఇంటర్( బైపీసీ) పూర్తిచేశాడు. గత నెల పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు.
చిన్నప్పటి నుంచి ఎంబీబీఎస్ చేయాలన్న కోరికతో కష్టపడి చదువుతున్నాడు. అయితే, పరీక్ష బాగా రాయలేదని, ఫెయిల్ అవుతానని, దాంతో ఎంబీబీఎస్ చేయలేనని ఆవేదనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 10న.. ‘‘అమ్మ, నాన్న క్షమించండి, నాకు ఎంబీబీఎస్‌లో సీటు రాదు.. అందుకనే ఆత్మహత్య చేసుకుంటున్నాను’’ అని సూసైడ్ లెటర్ రాసి ఉరి వేసుకొని చనిపోయాడు. మంగళవారం రిలీజ్ అయిన ఇంటర్ ఫలితాల్లో కృష్ణ 1000 మార్కులకు 892 మార్కులు సాధించి ఏ గ్రేడ్‌లో పాసయ్యాడు. దీంతో కృష్ణ తల్లిదండ్రులు.. కన్నీరుమున్నీరయ్యారు.