శాస్త్ర సాంకేతిక రంగాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇంధన శక్తి ప్రతి దేశానికి అత్యంత ప్రాముఖ్యమైనది. పెట్రోల్ డీజిల్ లాంటి ఇంధన వనరులే కాకుండా విద్యుత్ శక్తి దేశాల పారిశ్రామీకరణ స్థాయిని, ప్రజల జీవన ప్రమాణాలను పెంచే స్థాయిని నిర్దేశిస్తుంది. భారతదేశం, ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చమురు వినియోగదారు, దాని ముడి అవసరాలలో 85% దిగుమతి చేసుకుంటుంది. భారతదేశం విదేశీ వ్యాపారం ద్వారా ఆర్జించిన విలువైన అంతర్జాతీయ మారకద్రవ్యాన్ని సింహ భాగం దిగుమతులకే ఖర్చు చేస్తూ ఉండటం గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతూ వస్తున్నది.
ఒకవైపు సాంప్రదాయ పద్దతుల్లో ఇంధన ఉత్పత్తి నిలువలు తగ్గిపోతూ ఉండటం, మరోవైపు రోజురోజుకు ఇంధన శక్తి డిమాండు అంతకంతకు పెరుగుతూ ఉండటం స్పష్టంగా కనబడుతోంది. ఒక సాధారణ కుటుంబంలో సైతం వివిధ రకాల విద్యుత్ ఉపకరణాల వినియోగం సర్వసాధారణంగా మారిపోయింది. రోజు రోజుకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుండటంతో ప్రతి సౌకర్యం విద్యుత్ ఆధారంగా ఉండటంతో నాణ్యమైన విద్యుత్ ప్రజలకి అందుబాటులో తీసుకురావలసిన అవసరం ఉంది. భారీగా పెరుగుతున్న పారిశ్రామికీకరణ సాంకేతిక పరిజ్ఞానంతో వాతావరణంలో అసమతుల్యత భారీగా పెరిగిపోయి ప్రకృతి వైపరీత్యాలకు ప్రపంచం విలవిలలాడిపోతోంది. గృహవినియోగం, పరిశ్రమలకు వినియోగించే విద్యుత్ వరకు అనేక పరికరాలు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు విడుదల చేస్తున్నాయి. ప్రభుత్వం కాలుష్యరహిత ఇంధన ఉత్పత్తి కోసం సోలార్, విండ్ ఎనర్జీ వంటి లోతైన పరిశోధనలకు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నది.
భారత విద్యుత్ ప్రణాళికలు - ఫలితాలు
సౌర, పవన విద్యుత్ సామర్థ్యం గణనీయంగా పెరగడం వల్ల పునరుత్పాదక ఇంధన వినియోగంలో ప్రపంచ అగ్రగామిగా భారత్ స్థానం సుస్థిరమైంది. ప్రపంచంలోనే పునరుత్పాదకత ఇంధన స్థాపిత సామర్థ్యంలో భారత్ నాలుగవ స్థానంలో ఉంది. ప్రధాన మంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజనకార్యక్రమం సెప్టెంబర్ 25, 2017 నుండి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 2.86 కోట్ల విద్యుత్తు లేని కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్లను అందించింది. దేశంలోని ప్రతి గ్రామం, జిల్లాను కవర్ చేస్తూ, సార్వత్రిక గృహ విద్యుదీకరుణతో ఆయా కుటుంబాల్లో వెలుగులు ప్రసరింపజేసింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన 2014లో ప్రారంభించబడింది.
ఈ కార్యక్రమం ద్వారా విద్యుత్ లైను లేని 18,374 గ్రామాలకు సైతం కొత్త లైను వేసి, ఆయా గ్రామాలను విద్యుదీకరించడం జరిగింది. ఉన్నత్ జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్‌ఈడీస్ ఫర్ ఆల్ పథకం కింద, 2014, 19 మధ్య ఎల్‌ఈడీ బల్బుల కొనుగోలు ధర దాదాపు 90% తగ్గి రూ. 310 నుంచి రూ.39.90కి చేరుకుంది. ఈ పథకం కింద ఇప్పటివరకు 36.86 కోట్లకు పైగా ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేశారు. ఈ చొరవ గృహాలకు విద్యుత్ ఖర్చులను తగ్గించడమే కాకుండా "మేక్ ఇన్ ఇండియా" ప్రచారానికి మద్దతునిస్తూ ఎల్‌ఈడీ బల్బుల దేశీయ తయారీని ప్రోత్సహించింది. ఫలితంగా, విద్యుత్తు తక్కువ గ్రహించే పరికరాల తో వినియోగదారుడికి ఆదాయం ఆదా అవటంతో పాటు పర్యావరణ సమతుల్యతకు దోహదం చేసినట్లు ఉంది.
ఉద్గారాలను తగ్గించే ప్రయత్నం
భారతదేశం కర్బన ఉద్గారాలను తగ్గించడానికి లక్ష్యంగా, సమయానుకూల వాతావరణ కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. ప్రస్తుతం వాతావరణ మార్పు పనితీరు సూచిక, 2023 ప్రకారం G-20 దేశాలలో భారతదేశం 8వ స్థానంలో నిలిచింది. జీరో-కార్బన్ టెక్నాలజీలను ఆవిష్కరించుట, వినియోగించడం ద్వారా, కొత్త ఉద్యోగ కల్పన పెరగడంతో పాటు, కీలక రంగాల్లో ఉద్గారాలను తగ్గించగలదు. ఈ ఉద్గారాలను గణనీయంగా తగ్గించి వాతావరణ సమతుల్యతను సాధించడంలో అభివృద్ధి చెందిన దేశాలతో పాటుగా, ప్రపంచ దేశాలు అన్నిటిని భాగస్వామ్యం చేయటంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. పారిశ్రామిక, వ్యవసాయ, రవాణా రంగాల్లో తక్కువ కార్బన్ విడుదల చేసే యంత్రాలు, పనిముట్లను మార్చాల్సిన అవసరం ఉంది.
తక్కువ కార్బన్ విడుదల చేసే యంత్ర పరికరాలను వాడుతున్న సంస్థలకి పరిశ్రమలకి తగినంత ప్రోత్సాహకాలను అందజేయాలి. తక్కువ కార్బన్ విడుదల చేసే యంత్రాలు పనిముట్ల ధరలు అందుబాటులోకి వచ్చే విధంగా ఉండాలి. అంటే అవసరమైన ప్రయత్నాలు, ఆవిష్కరణలు నిరంతర నిబద్ధత వివిధ దేశాలతో భాగస్వామ్యాలు, సరళమైన పద్దతుల ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంటుంది. డిజిటల్ టెక్నాలజీలను మరింత సమర్థవంతంగా, వేగవంతంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లైతే కార్బన్ ఉద్గరాలను తగ్గించడంలో మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
G20 సమ్మిట్- ఎనర్జీ
భారతదేశ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్‌లో, గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ ప్రారంభించడం, భారతదేశం క్లీన్ ఎనర్జీ మూలాలకు ఆసక్తిని ప్రతిబింబిస్తుంది. భారత నుంచి వచ్చే 'భవిష్యత్ ఇంధనాలకు' ప్రాధాన్యంగా తెలిపింది. పలు దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రయాణంలో చేరుకుని, దృఢమైన జీరో-ఎమిషన్ లక్ష్యాలను స్థాపించడం బయోఫ్యూయల్స్ ప్రాముఖ్యతను గుర్తించేందుకు సాయంచేస్తుంది. ఈ అలయన్స్ లో ఉన్న సభ్య దేశాలు, ఇతర ముఖ్యమైన దేశాలతో ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి మేలు చేసే విధంగా జీవ ఇంధనాలను తయారు చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలను అందిపుచ్చుకునే అవకాశం అలయన్స్ కల్పిస్తుంది.
గ్లోబల్ బయో ఫ్యూయల్స్ అలయన్స్ స్థాపన అనేది స్థిరమైన ఇంధన వనరులకు పరివర్తనను సులభతరం చేయడానికి కీలకమైన దిశగా పరిగణించబడుతుంది. ఈ సహకార చొరవ స్థిరమైన జీవ ఇంధనాల ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించడానికి పెట్టుబడిదారులు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వాలు, పరిశ్రమ నిపుణుల నుంచి విభిన్న శ్రేణి వాటాదారులను ఏకం చేస్తుంది. కూటమి ఆర్థిక వృద్ధి, సామాజిక అభివృద్ధి, పర్యావరణ స్థిరత్వాన్ని ప్రోత్సహించే సమీకృత విధానాన్ని అందజేస్తుంది.
-చిట్టెడ్డి కృష్ణా రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ