హైదరాబాద్, వెలుగు: ఇథనాల్, హైడ్రోజన్, బయోఫ్యూయల్స్ వాడకాన్ని, ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. బెంగుళూరులో సెంటర్ ఫర్ హై టెక్నాలజీ (సీహెచ్‌టీ) ఆధ్వర్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఇండియన్ ఆయిల్) సహకారంతో నిర్వహిస్తున్న 'ఎనర్జీ టెక్నాలజీ మీట్ (ఈటీఎం) 2024' ను మంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ క్లీన్ ఎనర్జీల ద్వారా 'వికసిత భారత్'కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
మన దేశ ఎనర్జీ డిమాండ్ 2047 నాటికి రెట్టింపు అవుతుందన్నారు. రాబోయే రెండు దశాబ్దాల్లో భారతదేశం నుంచే 25 శాతం వృద్ధి ఉంటుందన్నారు. నికర జీరో లక్ష్యాలను సాధించడంలో చురుకుగా ఉన్న చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు), ప్రైవేట్ ఇంధన కంపెనీలను ప్రశంసించారు. మనదేశ ప్రస్తుత జీవ ఇంధనం మిశ్రమం రేటు 16.9 శాతానికి చేరుకుందని, 2030కి నిర్దేశించుకున్న 20 శాతం లక్ష్యాన్ని, షెడ్యూల్ కంటే ఐదేళ్ల ముందే అధిగమించే దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. జీవ ఇంధన కార్యక్రమాలలో వ్యవసాయ రంగానికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని తెలిపారు. దిగుమతి బిల్లులలో రూ. 91 వేల కోట్లను ఆదా చేశామని మంత్రి వివరించారు.