ఫార్ములా ఈ రేస్ కేసు.. అర్వింద్ కుమార్పై ఈడీ ప్రశ్నల వర్షం

  • హెచ్ఎండీఏ బోర్డు ద్వారా డబ్బులు ఎట్ల చెల్లించారు?
  • సీనియర్‌‌ ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్​కుఈడీ ప్రశ్న
  • ఫార్ములా–ఈ రేస్​ కేసులో విచారణ
  • 8 గంటలపాటు కొనసాగిన ఎంక్వైరీ
  • నిధుల ఖర్చుకు పాటించిన గైడ్​లైన్స్​పై క్వశ్చన్స్

హైదరాబాద్, వెలుగు:ఫార్ములా–ఈ -రేస్ కేసులో సీనియర్ ఐఏఎస్ అర్వింద్​కుమార్​ను ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌(ఈడీ) విచారించింది. ఏసీబీ నుంచి సేకరించిన దానకిశోర్‌‌‌‌ స్టేట్‌‌మెంట్స్‌‌ సహా హెచ్‌‌ఎండీఏ బోర్డ్‌‌ బ్యాంక్ అకౌంట్స్‌‌ ఆధారంగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. 

ప్రధానంగా హెచ్‌‌ఎండీఏ బోర్డుకు చెందిన రూ.54.89 కోట్ల దుర్వినియోగంపై కీలక వివరాలు రాబట్టింది. ఈ కేసులో హెచ్‌‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్‌‌‌‌ బీఎల్‌‌ఎన్‌‌ రెడ్డిని ఈడీ అధికారులు బుధవారం ఎంక్వైరీ చేశారు. విచారణలో భాగంగా ఐఏఎస్‌‌ అర్వింద్‌‌కుమార్‌‌‌‌ గురువారం ఉదయం11.15 గంటలకు బషీర్‌‌‌‌బాగ్‌‌లోని ఈడీ ఆఫీస్‌‌కు వచ్చారు.

అర్వింద్‌‌ కుమార్‌‌‌‌ను నలుగురు సభ్యుల ఈడీ బృందం ప్రశ్నించింది. రాత్రి 7.30 గంటల వరకు దాదాపు 8 గంటలపాటు ఎంక్వైరీ కొనసాగింది. ప్రధానంగా హెచ్‌‌ఎండీఏ బోర్డు ఆర్ధికలావాదేవీలపై ఈడీ ఆరా తీసింది. బోర్డుకు సంబంధించిన నిధులను ఖర్చు చేసేందుకు ఎలాంటి గైడ్‌‌లైన్స్‌‌ ఉంటాయనే కోణంలో విచారణ జరిగింది.

సీజన్‌‌ 9,10 కోసం హెచ్‌‌ఎండీఏ బోర్డ్‌‌ నుంచి ఎంత చెల్లించారు?

ఈడీ అధికారుల విచారణకు అర్వింద్‌‌కుమార్‌‌‌‌ ఎలాంటి డాక్యుమెంట్లు తీసుకురాలేదు. ఈడీ వద్ద ఉన్న ఆధారాలతోనే ఎంక్వైరీ జరిగింది. సీజన్‌‌ 9,10 నిర్వహణ కోసం చేసుకున్న అగ్రిమెంట్స్‌‌కు సంబంధించిన వివరాలను ఈడీ అధికారులు సేకరించారు. 

బ్రిటన్‌‌కు చెందిన ఫార్ములా– ఈ ఆపరేషన్స్‌‌, గ్రీన్‌‌ కో అనుబంధ సంస్థ ఏస్‌‌ నెక్ట్స్‌‌ జెన్‌‌కు సంబంధించిన వివరాలతో ప్రశ్నించారు. హైదరాబాద్‌‌లో ఈవెంట్‌‌ నిర్వహించడానికి గల కారణాలు, అందుకు సంబంధించిన ప్రతిపాదనలను అర్వింద్‌‌కుమార్ సమక్షంలోనే పరిశీలించారు.

 ఈ క్రమంలోనే బీఎల్‌‌ఎన్‌‌ రెడ్డి ఇచ్చిన స్టేట్‌‌మెంట్‌‌ ఆధారంగా అర్వింద్‌‌కుమార్‌‌‌‌ను ప్రశ్నించినట్టు తెలిసింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌‌ అండ్ అర్బన్‌‌ డెవలప్‌‌మెంట్‌‌(ఎంఏయూడీ), ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌, ఏస్‌‌ నెక్స్ట్‌‌ జెన్‌‌ చేసుకున్న త్రైపాక్షిక ఒప్పందానికి హెచ్‌‌ఎండీఏ బోర్డు ద్వారా ఎందుకు చెల్లింపులు జరిపారనే కోణంలో ప్రశ్నించినట్టు సమాచారం.

అనధికారికంగా బదిలీ చేయడం తప్పని తెలియదా?

సీజన్‌‌ 9 నిర్వహణ కోసం కేటాయించిన రూ.160 కోట్లకు సంబంధించిన వివరాలతో ఈడీ స్టేట్‌‌మెంట్‌‌ రికార్డ్ చేసింది. బ్రిటన్‌‌కు డబ్బు ట్రాన్స్‌‌ఫర్ చేయడంలో ఆర్బీఐ రూల్స్ పాటించకపోవడంపై ప్రశ్నించినట్టు తెలిసింది. 

ఇందులో భాగంగా సీజన్‌‌ 10 నిర్వహణకుగాను ప్రమోటర్స్ ఫీజు కింద హెచ్‌‌ఎండీఏకు అందిన రెండు ఇన్‌‌వాయిస్‌‌లను అర్వింద్‌‌కుమార్‌‌‌‌ ముందు పెట్టి ప్రశ్నించినట్టు సమాచారం. 

వీటిలో  రూ.22.67 కోట్లకు సంబంధించి 20‌‌‌‌23 సెప్టెంబర్‌‌‌‌ 25న ఫస్ట్‌‌ ఇన్‌‌స్టాల్‌‌మెంట్‌‌, అదే నెల 29న సెకండ్ ఇన్‌‌స్టాల్‌‌మెంట్‌‌ మేరకు రూ.23.02 కోట్లకు సంబంధించిన ఇన్‌‌వాయిస్‌‌ వివరాలను సేకరించినట్టు తెలిసింది. 

ఈ  క్రమంలోనే తన‌‌ ఆదేశాలతో బీఎల్‌‌ఎన్‌‌ రెడ్డి రెండు విడతలుగా రూ.45.71 కోట్లు హెచ్‌‌ఎండీఏ బోర్డు ఫండ్స్ నుంచి మంజూరు చేసినట్లు అర్వింద్‌‌కుమార్ వెల్లడించారని సమాచారం. 

ఇందుకు గాను రూ. 8 కోట్లు కూడా హెచ్‌‌ఎండీఏ అకౌంట్‌‌ నుంచే ఐటీ చెల్లించినట్టు అర్వింద్‌‌కుమార్ స్పష్టం చేశారు. ఇలా బ్రిటన్‌‌లోని ఫార్ములా– ఈ ఆపరేషన్స్‌‌ సంస్థ అకౌంట్స్‌‌కు రూ.45.71 కోట్లు బదిలీ చేసినట్టు వెల్లడించారు.