- నిషేధిత జాబితాలోని భూములు అన్యాక్రాంతం
- ఐఏఎస్ అమోయ్ కుమార్‌ను రెండో రోజు ప్రశ్నించిన ఈడీ
- పాస్‌బుక్స్, ధరణిలో మార్పులు, భూదాన్ భూముల రికార్డ్స్ పరిశీలన
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో జరిగిన భూఅక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కీలక వివరాలు సేకరించింది. ధరణి వెబ్ పోర్టల్, భూదాన్ భూములు, నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూముల అక్రమ కేటాయింపుల ద్వారా కోట్లాది రూపాయల ఆర్థికలావాదేవీలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించింది.
ఈ మేరకు మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు ప్రారంభించింది. ఈ మేరకు అమోయ్‌కుమార్‌తో పాటు పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులను గురువారం ఈడీ విచారించింది. బుధవారం నిర్వహించిన మొదటి రోజు విచారణకు కొనసాగింపుగా ఈడీ అధికారులు అమోయ్‌కుమార్‌ను ప్రశ్నించారు. డాక్యుమెంట్స్ ఆధారంగా స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. శుక్రవారం మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు.
అన్యాక్రాంతమైన భూముల రికార్డుల పరిశీలన
రెండు జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో అమోయ్‌కుమార్ ఇచ్చిన అనుమతులు, రిజిస్ట్రేషన్స్‌కు సంబంధించిన కీలక సమాచారం రాబడుతున్నది. మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్ భూముల డాక్యుమెంట్లను అమోయ్‌కుమార్ ఈడీకి అందించారు. 42 ఎకరాల 33 గుంటల భూమికి సంబంధించిన రికార్డులను ఈడీ అధికారులు పరిశీలించారు.
2005లో మహ్మద్ అక్బర్ అలీఖాన్, మహ్మద్ ఫరూక్ అలీఖాన్‌లకు హిబా కింద వారసత్వం పట్టా ఎలా వచ్చిందనే సమాచారం సేకరించారు. ఆ తరువాత షరీఫ్, ముజఫర్ హుస్సేన్ ఖాన్‌లు ఓనర్స్‌గా ఎలా వచ్చారని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే అన్యాక్రాంతానికి గురైన ప్రభుత్వ, భూదాన్‌భూముల రికార్డ్‌లను ఈడీ పరిశీలించింది.
ఆర్థిక లావాదేవీలపై నజర్
ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు కేటాయింపులు, నిషేధిత జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్స్‌కు చెందిన వివరాలను సేకరించింది. మహేశ్వరం భూదాన్ భూములకు సంబంధించి ఇప్పటికే మాజీ తహసీల్దార్, సబ్‌రిజిస్ట్రార్ ఆర్‌పీ జ్యోతితో పాటు ఈఐపీఎల్ కన్ స్ట్రక్షన్స్ కొండపల్లి శ్రీధర్ రెడ్డి సహా దాదాపు 15 మంది స్టేట్‌మెంట్స్‌ను ఈడీ ఇప్పటికే రికార్డ్ చేసినట్లు తెలిసింది. నిషేధిత జాబితాలో ఉన్న భూదాన్ భూములతో పాటు పలు కంపెనీలకు కేటాయించిన ప్రభుత్వ భూములకు సంబంధించిన సమాచారాన్ని ఈడీ అధికారులు సేకరించారు.
ఈ క్రమంలోనే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆర్థిక లావాదేవీలపై ఈడీ నజర్ పెట్టినట్లు తెలిసింది.ధరణిలో మార్పులు,ఫోర్జరీ డాక్యుమెంట్స్‌తో రూ వందల కోట్లు విలువ చేసే భూములను రియల్టర్లకు అప్పగించినట్లు ఈడీ అనుమానిస్తున్నది.ఈ మేరకు మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్నది.