కేటీఆర్​కు ఈడీ సమన్లు .. జనవరి 7న తమ ముందు హాజరుకావాలని ఆదేశం

కేటీఆర్​కు ఈడీ సమన్లు .. జనవరి 7న తమ ముందు హాజరుకావాలని ఆదేశం
  • ఫార్ములా- ఈ రేసు వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరం
  • -2న బీఎల్‌‌ఎన్‌‌ రెడ్డి , 3న అర్వింద్‌‌ కుమార్‌‌‌‌ విచారణ 
  • వాళ్లిద్దరి స్టేట్​మెంట్స్​ ఆధారంగా కేటీఆర్​ను ప్రశ్నించే చాన్స్​
  • బ్రిటన్​కు మనీలాండరింగ్​పై ఈడీ ఎంక్వైరీ
  • ఏయే అకౌంట్లలోకి ఎంతెంత వెళ్లిందనే దానిపై ఆరా
  • కీలకంగా మారనున్న బీఎల్‌‌ఎన్‌‌ రెడ్డి వాంగ్మూలం

హైదరాబాద్‌‌, వెలుగు: బీఆర్‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్‌‌‌‌కు ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌(ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఫార్ములా–-ఈ రేస్‌‌ కేసులో జనవరి 7న తమ ముందు విచారణకు రావాలని ఆదేశించింది. అదేవిధంగా ఇదే కేసులో హెచ్‌‌ఎండీఏ మాజీ చీఫ్‌‌ ఇంజినీర్‌‌‌‌ బి.లక్ష్మీనర్సింహారెడ్డిని జనవరి 2న, సీనియర్ ఐఏఎస్‌‌ ఆఫీసర్​ అర్వింద్‌‌కుమార్‌‌‌‌ను జనవరి 3న విచారణకు రావాలని సమన్లు పంపింది. ముగ్గురికి విడివిడిగా నోటీసులు అందజేసింది.

 షెడ్యూల్‌‌లో నిర్దేశించిన తేదీల్లో ఉదయం 10.30 గంటలకు తమ ముందు హాజరుకావాలని ఈడీ జాయింట్‌‌ డైరెక్టర్‌‌‌‌ రోహిత్ ఆనంద్‌‌ ఆదేశించారు. గత బీఆర్​ఎస్​ హయాంలో ఫార్ములా –ఈ రేస్‌‌ కోసం హెచ్​ఎండీఏ నిధులను విదేశాలకు తరలించడంపై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్​ వ్యవహారం కావడంతో ఏసీబీ ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌ ఆధారంగా ఈడీ కూడా కేసు ఫైల్​ చేసింది. ఫారిన్ ఎక్స్‌‌ఛేంజ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ యాక్ట్‌‌,  మనీలాండరింగ్‌‌ యాక్ట్​ (పీఎమ్‌‌ఎల్‌‌ఏ) కింద ఎఫ్​ఐఆర్​లు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా కేటీఆర్‌‌‌‌‌‌‌‌, అర్వింద్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, బీఎల్‌‌‌‌ఎన్‌‌‌‌రెడ్డికి నోలీసులు ఇచ్చింది. 

హెచ్‌‌‌‌ఎండీఏ నిధులపై బీఎల్‌‌‌‌ఎన్‌‌‌‌ రెడ్డి  లెక్క చెప్పాల్సిందే

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సిన ఫార్ములా–ఈ రేసు సీజన్10 నిర్వహణ నుంచి ప్రమోటర్ సంస్థ ఏస్‌‌‌‌ నెక్ట్స్‌‌‌‌జెన్‌‌‌‌ తప్పుకోవడంతో ఎఫ్‌‌‌‌ఈవో (ఫార్ములా –ఈ ఆపరేషన్స్​) సంస్థతో గత బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో అగ్రిమెంట్​ చేసుకున్నారు. అదీ అసెంబ్లీ ఎన్నికల కోడ్​ ఉన్న టైమ్​ కావడం.. పైగా ఆర్బీఐకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బ్రిటన్​లోని ఎఫ్​ఈవోకు డబ్బులు పంపారు. హెచ్‌‌‌‌ఎండీఏ బోర్డు అకౌంట్‌‌‌‌ నుంచే బ్రిటన్‌‌‌‌కు డబ్బు ట్రాన్స్‌‌‌‌ఫర్ అయినట్లు  ఈడీ గుర్తించింది. బ్రిటన్​లోని ఏయే అకౌంట్లలోకి ఎంతెంత డబ్బు ట్రాన్స్​ఫర్​ అయిందనే దానిపై ఆరా తీస్తున్నది. ఇదే క్రమంలో.. ఏసీబీ కేసులో మూడో నిందితుడైన హెచ్‌‌‌‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌ బి.లక్ష్మీనర్సింహారెడ్డిని జనవరి 2న విచారించనుంది.

 నిరుడు అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 3, 11వ తేదీల్లో హెచ్‌‌‌‌ఎండీఏ బోర్డు నుంచి మంజూరైన రూ. 45.71 కోట్లు, పెనాల్టీగా ఐటీకి చెల్లించిన రూ. 8 కోట్లు సహా మొత్తం రూ. 54.89 కోట్లకు సంబంధించిన వివరాలను రాబట్ట నుంది. ఇందుకోసం పూర్తి డాక్యుమెంట్లు,హెచ్‌‌‌‌ఎండీఏ రికార్డులతో తమ ముందు విచారణకు హాజరుకావాలని బీఎల్​ఎన్​రెడ్డికి నోటీసుల్లో ఈడీ స్పష్టం చేసింది. ఆయన ఇచ్చే స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆధారంగా జనవరి 3న ఐఏఎస్ అర్వింద్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ను ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. వీళ్లిద్దరి స్టేట్​మెంట్ల ఆధారంగా జనవరి 7న కేటీఆర్​ను ఈడీ ప్రశ్నించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఏసీబీ ఫైల్​ చేసిన కేసులో ఏ1న కేటీఆర్​, ఏ2గా అర్వింద్​కుమార్​, ఏ3గా బీఎల్​ఎన్​రెడ్డిని చేర్చారు. 

హెచ్‌‌‌‌ఎండీఏ బోర్డు నుంచే రూ.160 కోట్లకు అగ్రిమెంట్‌‌‌‌

మున్సిపల్​ అడ్మినిష్ట్రేషన్​ అండ్​ అర్బన్​ డెవలప్​మెంట్​ (ఎంఏయూడీ), ఎఫ్‌‌‌‌ఈవో ఆధ్వర్యంలో ఫార్ములా –ఈ రేసు సీజన్‌‌‌‌ 10నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన ఫైల్‌‌‌‌ను అప్పటి స్పెషల్ సెక్రటరీ హెచ్‌‌‌‌ఎండీఏ స్పెషల్‌‌‌‌ చీఫ్‌‌‌‌ సెక్రటరీ అర్వింద్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, అప్పటి మున్సిపల్‌‌‌‌శాఖ మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు 2023 సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌27న అందించారు. నాటి మున్సిపల్‌‌‌‌శాఖ మంత్రి ఆదేశాలతో అర్వింద్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌.. ఫార్ము లా –ఈ ఆపరేషన్స్‌‌‌‌ (ఎఫ్​ఈవో), ఎంఏయూడీ మధ్య 2023 అక్టోబర్‌‌‌‌ ‌‌‌‌30న మరో కొత్త ఒప్పందం చేసుకున్నారు. 

ఈవెంట్‌‌‌‌ నిర్వహణ కోసం స్పాన్సర్‌‌‌‌‌‌‌‌ ఫీజు, ట్యాక్స్‌‌‌‌లు కలిపి మొత్తం రూ.110 కోట్లు చెల్లించేలా అగ్రిమెంట్‌‌‌‌లో పేర్కొన్నారు. ఈవెంట్ నిర్వహణ కోసం మున్సిపల్ సర్వీసెస్‌‌‌‌, సివిల్‌‌‌‌ వర్క్స్ కోసం మరో రూ. 50 కోట్లు ఖర్చు చేసే విధంగా అండర్‌‌‌‌‌‌‌‌ టేకింగ్‌‌‌‌ తీసుకున్నారు. ఇలా హెచ్‌‌‌‌ఎండీఏ బోర్డుకు సంబంధించిన నిధుల నుంచి మొత్తం రూ.160 కోట్లు అప్రూవల్ శాంక్షన్ చేసే విధంగా ఒప్పందం జరిగింది. 

రెండు ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్స్‌‌‌‌ మంజూరు చేసిన బీఎల్‌‌‌‌ఎన్‌‌‌‌ రెడ్డి

ఫార్ములా–ఈ రేసు సీజన్‌‌‌‌ 10 నిర్వహణకు ప్రమోటర్స్ చెల్లించాల్సిన ఫీజ్‌‌‌‌కు సంబంధించి ఫస్ట్‌‌‌‌, సెకండ్ ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్స్‌‌‌‌కు సంబంధించిన రెండు ఇన్వాయిస్‌‌‌‌లు ఎఫ్‌‌‌‌ఈవో నుంచి హెచ్‌‌‌‌ఎండీఏకు చేరాయి. ఇందులో 2023 సెప్టెంబర్‌‌‌‌ 25న మొదటి ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్‌‌‌‌కు సంబంధించిన ఇన్వాయిస్ ప్రకారం రూ 22 కోట్ల 69 లక్షల,63 వేల125 (ట్యాక్స్‌‌‌‌లు కమిషన్‌‌‌‌తో కలిపి), సెకండ్ ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్‌‌‌‌కు సంబంధించి అదే నెల 29న చేరిన ఇన్వాయిస్‌‌‌‌ ప్రకారం రూ. 23 కోట్ల 01 లక్ష 97 వేల 500 ఎఫ్‌‌‌‌ఈవోకు చెల్లించాలి.

 ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌‌‌‌ను అప్పటి హెచ్‌‌‌‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌ బి.లక్ష్మీనర్సింహారెడ్డి పూర్తి చేశారు. అదే ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 3న మొదటి ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్‌‌‌‌ కింద రూ.22,69,63,125‌‌‌‌, అక్టోబర్ 11న రెండో ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్‌‌‌‌ కింద రూ.23,01,97,500 మంజూరు చేశారు. ఈ డబ్బులు హిమాయత్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోని ఇండియన్‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌సీస్‌‌‌‌ బ్యాంక్​లోని హెచ్​ఎండీఏ బోర్డు అకౌంట్​ నుంచి వెళ్లాయి. 

ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ ఆడిట్‌‌‌‌లో దొరికిపోయారు

హెచ్‌‌‌‌ఎండీఏ బోర్డు అకౌంట్‌‌‌‌ నుంచి బ్రిటన్‌‌‌‌లోని అకౌంట్స్​కు ఎలాంటి ట్యాక్స్‌‌‌‌లు చెల్లించకుండానే రూ.45.71 కోట్లు ట్రాన్స్‌‌‌‌ఫర్ చేసినట్లు ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ ఆడిట్‌‌‌‌లో వెలుగు చూసింది. దీంతో హెచ్‌‌‌‌ఎండీఏ బోర్డుకు ఐటీ నోటీసులు ఇచ్చింది. ఇందుకు గాను హెచ్‌‌‌‌ఎండీఏ నిధుల నుంచే రూ. 8 కోట్ల  6లక్షల 75 వేల 404 చెల్లించాల్సి వచ్చింది. దీంతో పాటు  ఇన్‌‌‌‌స్క్రిప్షన్ - ఇంటర్‌‌‌‌స్టేట్ చాంపియన్​షిప్​ క్యాలెండర్ ఫీజు, పర్మిట్ ఫీజు కోసం ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియాకు మరో రూ. 1,10,51,014 హెచ్‌‌‌‌ఎండీఏ చెల్లించింది.

 ఇట్ల మొత్తంగా రూ. 54,88,87,043 హెచ్‌‌‌‌ఎండీఏ నిధుల నుంచి చెల్లింపులు జరిగాయి. హెచ్‌‌‌‌ఎండీఏ నిబంధనల ప్రకారం రూ. 10 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తే ప్రభుత్వం,ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి తీసుకోవాలి. కానీ, ఎలాంటి అనుమతులు లేకుండానే ఇదంతా జరిగింది. ఈ వ్యవహారంపై ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.  ఇందులో భాగంగానే  కేటీఆర్​, అర్వింద్​కుమార్​, బీఎల్​ఎన్​రెడ్డికి నోటీసులు పంపారు. విచారణకు రావాలని ఆదేశించారు.

బ్యాంక్ మేనేజర్‌‌‌‌ను దబాయించి..!

హిమాయత్‌‌నగర్‌‌‌‌లోని ఇండియన్‌‌ ఓవర్‌‌‌‌సీస్‌‌ బ్యాంక్‌‌లో గల హెచ్‌‌ఎండీఏ బోర్డ్ అకౌంట్‌‌ నుంచి బ్రిటన్‌‌లోని ఫార్ములా –ఈ ఆపరేషన్స్‌‌ అకౌంట్‌‌కు మనీ ట్రాన్స్‌‌ఫర్ చేసేందుకు నాడు హెచ్​ఎండీఏ ఆఫీసర్లు ప్రయత్నించారు. మనీ ట్రాన్స్​ఫర్​కు సంబంధించి ఎలాంటి జీవో లేకపోవడంతో నాడు బ్యాంకు మేనేజర్‌‌‌‌ నిరాకరించినట్లు తెలిసింది. దీంతో బ్యాంక్‌‌లో ఉన్న హెచ్‌‌ఎండీఏ అకౌంట్స్‌‌ విత్‌‌డ్రా చేసుకుంటామని సంబంధిత అధికారులు దబాయించడంతో తప్పనిసరి పరిస్థితిల్లో ఆ మేనేజర్​ అంగీకరించినట్లు సమాచారం. 

ఈ క్రమంలోనే రెండు ఇన్‌‌స్టాల్‌‌మెంట్స్‌‌కు సంబంధించి రూ. 45 కోట్ల 71 లక్షల 60 వేల 625 ఇండియన్ కరెన్సీని 4,50,000 గ్రేట్‌‌ బ్రిటన్‌‌ పౌండ్స్‌‌గా కన్వర్ట్‌‌ చేశారు. ఈ మొత్తాన్ని 2023 అక్టోబర్‌‌‌‌ 11న బ్రిటన్‌‌లోని ఎఫ్‌‌ఈవో అకౌంట్స్​కు  ట్రాన్స్‌‌ఫర్ చేశారు. ఇందులోనూ ఆర్బీఐ నిబంధనలను పాటించలేదు.