- ఢిల్లీ ఆఫీసులో గురువారం విచారణకు రావాలని ఆదేశం
- పిళ్లై, బుచ్చిబాబు స్టేట్‌మెంట్స్ ఆధారంగా నోటీసులు
- ఈ నెల 15 తర్వాత వస్తానన్న కవిత.. ఈడీ నుంచి నో రిప్లై
- 11న వస్తానని మరోసారి రిక్వెస్ట్.. అనంతరం ఢిల్లీకి
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం సమన్లు జారీ చేసింది. గురువారం ఉదయం10.30 గంటలకు ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌లో విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. అయితే.. తనకు ముందస్తు అపాయింట్మెంట్స్, కార్యక్రమాలు ఉన్నందున గురువారం విచారణకు హాజరుకాలేనని, ఈ నెల 15 తర్వాత వస్తానని ఈడీకి కవిత మెయిల్ చేశారు. దీనిపై ఈడీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ఈ నెల 11న విచారణకు వస్తానని ఆమె రెండో రిక్వెస్ట్ పంపి.. సాయంత్రం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం శుక్రవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేపట్టనున్నట్లు ఇప్పటికే ఆమె ప్రకటించారు. అయితే.. గురువారం ఈడీ ముందు విచారణకు హాజరవుతారా? లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పటివరకు లిక్కర్ స్కామ్ కేసులో 12 మంది అరెస్ట్ అయ్యారు. ఇందులో సౌత్ గ్రూప్‌కు చెందినవాళ్లు ఆరుగురు ఉన్నారు.
పిళ్లై, బుచ్చిబాబు స్టేట్మెంట్స్తో..!
లిక్కర్ స్కామ్ కేసులో డిసెంబర్ 11న హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారించింది. 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చి ప్రశ్నించింది. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నది. స్కామ్‌లో జరిగిన రూ.వందల కోట్ల మనీల్యాండరింగ్‌పై ఆరా తీసింది.సీబీఐ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లైని 29 సార్లు ఈడీ విచారించింది. విచారణకు సహకరించడం లేదని సోమవారం రాత్రి అరెస్ట్ చేసింది. 17 పేజీల రిమాండ్ రిపోర్ట్ ఫైల్ చేసింది. లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు అరుణ్ రామచంద్ర పిళ్లై బినామీగా వ్యవహరించినట్లు రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. ఇండో స్పిరిట్స్ డిస్టిలరీస్‌లో కవిత తరఫున పిళ్లై పెట్టుబడులు పెట్టినట్లు వివరించింది. పిళ్లై, కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు స్టేట్‌మెంట్స్ ఆధారంగా కవితకు బుధవారం ఉదయం నోటీసులు ఇష్యూ చేసింది.
సౌత్ గ్రూప్ లిక్కర్ లింకులు, అరెస్ట్‌లు
తెలంగాణ తలవంచదు
తెలంగాణ తలవంచదు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం 10న దీక్ష తలపెట్టినం. కానీ, గురువారం విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నా నేరుగా ఈడీ ఆఫీసుకు పిలవడంలో ఆంతర్యం ఏమిటి? ఇంత తక్కువ టైమ్‌లో హడావుడిగా విచారణకు రావాలనడం ఏమిటి? రాజకీయ కక్షలో భాగంగానే ఇదంతా చేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఒక సామాజిక కార్యకర్తగా ఒక వారం ముందే నా కార్యక్రమాలు ఫిక్సయ్యాయి. కాబట్టి, 11వ తేదీన విచారణకు హాజరవుతా. దేశ పౌరురాలిగా, ఒక మహిళగా చట్టపరమైన అన్ని హక్కులను ఉపయోగించుకుంటా. మహిళను తన నివాసంలోనే విచారించాలని కోర్టు తీర్పు ఉంది. వీటన్నింటినీ ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు?
దేశం బాగుకోసం గొంతెత్తుతం.
- ఈడీ నోటీసులపై కవిత స్పందన
సౌత్ గ్రూపులో అరెస్ట్ అయిన వారు
- సెప్టెంబర్ 27: సమీర్ మహేంద్రు
- నవంబర్ 11: పి. శరత్ చంద్రా రెడ్డి
- నవంబర్ 13: అభిషేక్ బోయినపల్లి
- ఫిబ్రవరి 8: గోరంట్ల బుచ్చిబాబు
- ఫిబ్రవరి 11: మాగుంట రాఘవ్
- మార్చి 6: అరుణ్ రామచంద్ర పిళ్లై