- మంత్రి సోదరుడు, పీఏ సహా పలువురి ఇండ్లలో తనిఖీలు
- జల్ జీవన్ మిషన్‌లో అక్రమాలపై విచారణ
రాంచీ: జార్ఖండ్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాదాపు 20 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించారు. రాష్ట్ర తాగునీటి, పారిశుద్ధ్య శాఖ మంత్రి మిథిలేశ్ కుమార్ థాకూర్ సోదరుడు వినయ్ థాకూర్, మంత్రి పీఏ హరేంద్ర సింగ్‌తోపాటు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మనీష్ రంజన్, పలువురు కీలక అధికారులు, కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలఇండ్లలో సోమవారం సోదాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ స్కీమ్ జల్ జీవన్ మిషన్ అమలులో రాష్ట్రంలో భారీగా అక్రమాలు జరిగినట్లు నిరుడు డిసెంబర్లో ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
కమీషన్ల రూపంలో కోట్లాది రూపాయలు దారిమళ్లించినట్లు గుర్తించింది. ఇదే అంశంలో ఆర్ అండ్ బీ డిపార్ట్మెంట్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మనీష్ రంజన్‌ను ఇటీవల ఈడీ విచారించింది. ఇప్పుడు ఏకకాలంలో జార్ఞండ్ రాజధాని రాంచీలోని 20 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించడం, పైగా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రం కావడంతో ఇది పొలిటికల్ చర్చకు దారితీసింది. ఈడీ దాడులు ఊహించని విషయమేమీ కాదని, ఇలా జరుగుతాయని తామకు తెలుసని, అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం బీజేపీ కుట్రలు చేస్తున్నదని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ వ్యాఖ్యానించారు.