నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు .. 23 లీటర్ల నాటుసారా సీజ్ 

హుజూర్‌నగర్, వెలుగు: నియోజకవర్గంలోని మట్టంపల్లి, చింతలపాలెం, మేళ్లచెర్వు మండలాల్లోని పలు గ్రామాల్లో నల్గొండ ఎక్సైజ్, ఎన్​ఫోర్స్​మెంట్​అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 23 లీటర్ల నాటుసారాతోపాటు300 కిలోల బెల్లం, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎర్రకుంట తండాకు చెందిన బానోతు శ్రీను నుంచి 5 లీటర్లు, బానోతు హనుమ నుంచి 3 లీటర్ల సారా స్వాధీనం చేసుకొని వారిని అరెస్ట్ చేశారు.

చింతలపాలెం మండల కేంద్రంలోని ఓ ఇంట్లో 300 కిలోల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. అదే గ్రామానికి చెందిన చిత్తలూరి లక్ష్మీ సారా విక్రయిస్తుండగా ఆమె వద్ద నుంచి 5 లీటర్ల సారా స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. మట్టంపల్లి మండలంలోని అవిరేణికుంట తండా, సుల్తానాపూర్ తండా, రామచంద్రపురం తండాల శివార్లలో దాచిన సుమారు 900 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు.

మట్టంపల్లి మండలం కాల్వపల్లి తండాకు చెందిన బానోతు కోట, బానోతు సోముడు వాహనంపై10 లీటర్ల సారా తరలిస్తుండగా బానోతు కోటను అరెస్ట్​చేసి ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు. ఇరువురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ నాగార్జున రెడ్డి తెలిపారు. దాడుల్లో జిల్లా ఎక్సైజ్​శాఖ సూపరింటెండెంట్​లక్ష్మణ్​నాయక్, సీఐలు రాకేశ్, మల్లయ్య, శంకర్,  ఎస్సైలు దివ్య, జగన్ మోహన్ రెడ్డి, రవి, నరేశ్, నాగరాజ్, రుక్మారెడ్డి, ధనుంజయ్, సిబ్బంది పాల్గొన్నారు.