- సీఎంఆర్ వడ్లు పక్కదారి పట్టించిన మిల్లర్లకు వార్నింగ్
- సీక్రెట్ గా తనిఖీలు చేపట్టిన విజిలెన్స్, ఎన్‌ఫోర్స్ మెంట్ టీం
నిజామాబాద్, వెలుగు: జిల్లాలోని పలు రైస్ మిల్స్‌పై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ల టీం శనివారం రైడ్స్ నిర్వహించింది. ఆరుగురు సభ్యులతో కూడిన బృందం గుండారం, ఖానాపూర్, మాధవ్‌నగర్ మిల్లుల్లో సోదాలు చేపట్టి సీఎంఆర్ వడ్ల వివరాలు చెక్ చేశారు. స్థానిక సివిల్ సప్లై ఆఫీసర్లను జాయిన్ చేసుకోకుండా సీక్రెట్‌గా ఈ తనిఖీలు చేపట్టారు. వారి పరిశీలనలో తేలిన విషయాలు బయటకు లీక్ కాకుండా జాగ్రత్తలు పాటించారు. హైదరాబాద్‌లోని హెడ్ఆఫీస్తో మాత్రమే సమాచారాన్ని షేర్ చేశారు. రెండు సీజన్లలో మిల్లులకు పంపిన వడ్లు అక్కడి నుంచి సరఫరా అయిన రైస్ రికార్డులు వెరిఫై చేశారు.
స్టాక్ పరమైన తేడాలున్న మిల్లర్లకు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. స్టాక్ తేడాలను భర్తీ చేయడానికి గడువిచ్చి నిర్లక్ష్యం చేస్తే బ్లాక్ లిస్టులో పెడతామని, క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. పొలిటికల్ లీడర్లు నడుపుతున్న రైస్ మిల్లులపై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ టీం వాటిపైనే దృష్టి సారించింది. పలుకుబడి వినియోగించి సీఎంఆర్ వడ్లు మాయం చేశారని కంప్లైంట్వెళ్లింది. విజిలెన్స్ తనిఖీలతో జిల్లాలోని మిల్లర్లంతా అలర్టయ్యారు. వీటిని ఎన్ని రోజులు కొనసాగిస్తారనే విషయం తెలియదు.
80 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ పట్టివేత
కోటగిరిలోని బాలాజీ రైస్ మిల్లులో శనివారం ఉదయం ఎన్ఫోర్స్మెంట్ డీటీ నిఖిల్ఆధ్వర్యంలో 80 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ పట్టుకున్నారు. పక్కా సమాచారంతో దాడి నిర్వహించి బియ్యాన్ని హ్యండోవర్ చేసుకున్నారు. పంచనామా నిర్వహించి మిల్లుపై కేసు నమోదు చేశారు.