భద్రాద్రి జిల్లాలో కలకలం రేపుతున్న తనిఖీలు

  •     అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
  •     సీఐ సస్పెన్షన్​తో అబ్కారీ శాఖలో ఆందోళన

భద్రాచలం, వెలుగు: ఎన్​ఫోర్స్​మెంట్, స్టేట్, డిస్ట్రిక్ట్  టాస్క్ ఫోర్సు టీమ్స్​ 3 రోజులుగా జిల్లాలో పాగా వేశాయి. ఎక్కడికక్కడ నిఘా పెట్టి దాడులు చేస్తున్నాయి. వైన్​షాపుల నుంచి బెల్టు షాపులకు మద్యం వెళ్లకుండా నియంత్రిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఇల్లందు పట్టణంలోని​రెండు వైన్​షాపుల నుంచి రెండు ఆటోల్లో తరలిస్తున్న రూ.2 లక్షల మద్యాన్ని పాటు ఆటోలను సీజ్​ చేశారు. శుక్రవారం కొత్తగూడెం పట్టణంలో మద్యాన్ని టాస్క్ ఫోర్స్  బలగాలు పట్టుకుని కేసు నమోదు చేశాయి. వైన్​షాపులతో పాటు ప్రతీ గ్రామంలో నిఘా ఏర్పాటు చేయడంతో బెల్ట్​ షాపులు మూసివేశారు. దీంతో జిల్లాలోని సిండికేట్​ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 14 బార్లు, 100 వైన్స్​ ఉన్నాయి. ఇక వీటి పరిధిలో వెయ్యికి పైగా బెల్ట్​ షాపులున్నాయి. 

అతి చేయడంతోనే..

రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాల కోసం అబ్కారీ శాఖ ద్వారా టార్గెట్లు విధిస్తోంది. జిల్లాలకు టార్గెట్లు పెట్టి 20 శాతం అదనంగా అమ్మకాలు జరపాలని ఆదేశాలు జారీ చేస్తోంది. అబ్కారీ సీఐలు వైన్​షాపుల యజమానులను ఒప్పించి మద్యం అమ్మకాలు పెరిగేలా చూస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచే టార్గెట్లు వస్తున్న నేపథ్యంలో సిండికేట్​గా ఏర్పడిన వ్యాపారులు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. బెల్ట్​ షాపులకు ఒక్కో క్వార్టర్​పై రూ.20 ఎక్కువ తీసుకొని సరఫరా చేస్తున్నారు. బెల్ట్​ షాపు ఓనర్లు మరో రూ.20 ఎక్కువకు అమ్ముతున్నారు. దీంతో ఎమ్మార్పీ కంటే క్వార్టర్​ బాటిల్​పై రూ.40 ఎక్కువగా వసూలు చేస్తున్నారు.

వైన్​షాపుల్లో కొన్ని బ్రాండ్లను అమ్మకుండా నేరుగా బెల్ట్​షాపుల్లో ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని అంటున్నారు. దీనిపై ఫిర్యాదు చేయడంతో ఎన్​ఫోర్స్ మెంట్​ ఆఫీసర్లు జిల్లాపై దృష్టి పెట్టారు. వారి తనిఖీల్లో చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, సుజాతనగర్​ మండలాల్లోని  షాపుల్లో ఎమ్మార్పీ రేటు కంటే ఎక్కువకు మద్యం విక్రయిస్తున్నట్లు తేలింది. దీంతో కొత్తగూడెం ఎక్సైజ్​ సీఐ నరేందర్​రెడ్డిని సస్పెండ్​ చేశారు. సూర్యాపేట, మహబూబాబాద్​ జిల్లాల్లో కూడా సీఐలను సస్పెండ్ చేశారు. 

వ్యాపారుల్లో ఆందోళన

సీఐ సస్పెన్షన్​, టాస్క్ ఫోర్స్  దాడులతో సిండికేట్​ వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. చాలా చోట్ల సిండికేట్​ ఆఫీసులను ఎత్తేశారు. అక్రమ సంపాదనకు బ్రేక్​ పడటం, సీఐపై యాక్షన్​ తీసుకోవడంతో ఆందోళన చెందుతున్నారు. టాస్క్ ఫోర్స్​ ఆఫీసర్లు కఠినంగా వ్యవహరించడం సిండికేట్లకు రుచించడం లేదు. దీనిపై సంబంధిత శాఖ ఉన్నతాధికారులను కలిశారు. ఎమ్మార్పీ రేట్లు, బెల్ట్​ షాపుల నియంత్రణ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేయడంతో ఆందోళన చెందుతున్నారు. న్యూఇయర్, సంకాంత్రి పండుగ వేళ తమ వ్యాపారంపై ఈ దాడులు ప్రభావం చూపుతాయని వాపోతున్నారు. 

నిబంధనలు పాటించట్లే..

జిల్లాలో ఎక్కడా ఎమ్మార్పీ రేట్లు అమలు కావడం లేదు. వైన్​షాపుల నుంచి ఉదయమే బెల్ట్​ షాపులకు మద్యం ఆటోల్లో సిండికేట్​ ఆఫీసుల నుంచి తరలిస్తున్నారు. బెల్ట్​ షాపుల్లో గిరాకీ పెంచేందుకు మద్యం షాపులను ఉదయం ఆలస్యంగా తెరవడం, రాత్రి తొందరగా మూసివేస్తున్నారనే విమర్శలున్నాయి. దీనిపై ఎన్​ఫోర్స్ మెంట్​ ఆఫీసర్లు రహస్యంగా విచారణ చేపట్టగా సుజాతనగర్, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ దుకాణాల్లో ఈ పరిస్థితి కనిపించింది. అయితే మిగిలిన మండలాల్లోనూ ఇలాగే చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.