Virat Kohli: భీకర ఫామ్‌లో ఇంగ్లీష్ కెప్టెన్.. కోహ్లీ రికార్డు బద్దలు

ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల(వన్డే) కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ పరుగుల వరద పారిస్తున్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వరుసగా మూడో హాఫ్ సెంచరీ(110*, 87, 72) బాదిన బ్రూక్.. భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్‌ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టాడు. ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో కంగారూల జట్టుపై అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు.

2019లో ఆస్ట్రేలియాతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో కోహ్లీ 310 పరుగులు చేయగా.. బ్రూక్ దానిని అధిగమించాడు. ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ ధోని 285 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.

ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్లు(ద్వైపాక్షిక సిరీస్‌, వన్డేలు )

హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్): 312 పరుగులు
విరాట్ కోహ్లీ (భారత్): 310 పరుగులు
ఎంఎస్ ధోని (భారత్): 285 పరుగులు
ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లండ్): 278 పరుగులు
బాబర్ ఆజం (పాకిస్థాన్): 276 పరుగులు

సిరీస్ ఆసీస్‌దే 

ఇక ఈ సిరీస్ విషయానికొస్తే, ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-2 తేడాతో చేజిక్కించుకుంది. ఆదివారం(సెప్టెంబర్ 29) ఈ  ఇరు జట్ల మధ్య జరిగిన ఆఖరి వన్డేలో ఆతిథ్య ఇంగ్లాండ్ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు 49.2 ఓవర్లలో 309 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. ఛేదనలో ఆసీస్ 20.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. అనంతరం వర్షం అంతరాయం కలిగించగా.. డీఎల్ఎస్ పద్ధతిలో కంగారూల జట్టు విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.