ENG vs IND 2nd T20: ఆశలు వదిలేసుకున్న మ్యాచ్లో టీమిండియా విక్టరీ.. దుమ్మురేపిన తిలక్ వర్మ.. 72 నాటౌట్..

ENG vs IND 2nd T20: ఆశలు వదిలేసుకున్న మ్యాచ్లో టీమిండియా విక్టరీ.. దుమ్మురేపిన తిలక్ వర్మ.. 72 నాటౌట్..

చెన్నై: తెలుగు కుర్రాడు తిలక్ వర్మ సత్తా చాటాడు. ఓపెనర్లతో సహా వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్టు పెవిలియన్ బాట పడుతుంటే అతనొక్కడే ఇంగ్లండ్ బౌలర్లకు అడ్డుగా నిలిచాడు. అభిమానులు ఆశలు వదిలేసుకున్న మ్యాచ్లో అదరగొట్టి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. 55 బంతుల్లో 5 సిక్సర్లు, 4 ఫోర్లతో 72 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. 5 టీ20ల సిరీస్లో టీమిండియా 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. తిలక్ వర్మ ఒంటరి పోరు టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించింది.

ALSO READ | IND vs ENG: ఆఖర్లో బ్రైడన్ కార్స్ మెరుపులు.. టీమిండియా ఎదుట ట్రికీ టార్గెట్

టీమిండియా, ఇంగ్లండ్ మధ్య ఉత్కంఠగా సాగిన సెకండ్ టీ20 మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. 8 వికెట్ల నష్టానికి 19.2 ఓవర్లలో 166 పరుగులు చేసి టీమిండియా విక్టరీ కొట్టింది. నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను మట్టికరిపించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా ఇంగ్లండ్ జట్టును నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు తీసి 165 పరుగులకు కట్టడి చేసింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 19 పరుగులకే ఇద్దరు ఓపెనర్లను కోల్పోయింది.

ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో 79 పరుగులతో రాణించిన అభిషేక్ శర్మ  సెకండ్ టీ20లో మాత్రం 12 పరుగులకే ఔట్ అయి నిరాశపరిచాడు. మార్క్ వుడ్ బౌలింగ్లో ఎల్బీడబ్యూగా వెనుదిరిగాడు. సంజూ శాంసన్ కూడా 5 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ టీ20ల్లో మరోమారు పేలవ ఫామ్తో టీమిండియా అభిమానుల ఆశలను ఆవిరి చేశాడు. 7 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయి విమర్శల పాలయ్యాడు.

ఒకప్పుడు టీ20 బ్యాటర్గా జేజేలు అందుకున్న సూర్య కుమార్ యాదవ్ గత ఐదు మ్యాచ్ల్లో దారుణ ఆట తీరుతో విమర్శలు మూటగట్టుకున్నాడు. 12(7), 0(3), 1(4), 4(9), 21(17). ఇవీ రీసెంట్ మ్యాచుల్లో స్కై బ్యాటింగ్ సాగిన తీరు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ తాను బౌలింగ్ చేసిన 4 ఓవర్లకు గానూ 60 పరుగులు సమర్పించుకున్నాడు. టీమిండియా బ్యాటర్లు సెకండ్ టీ20లో ఆర్చర్ టార్గెట్గా పరుగులు రాబట్టుకున్నారు.