స్వదేశంలో ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగించింది. తొలిరోజే మ్యాచును వన్ సైడ్ చేసిన ఇంగ్లండ్ ఆటగాళ్లు.. రెండో రోజు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. సీనియర్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్ ఐదు వికెట్లతో చెలరేగడంతో ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 172 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ బ్యాట్లర్లు.. పసికూన జట్టు బౌలర్లను చీల్చి చెండాడారు. సెంచరీ, డబుల్ సెంచరీ అంటూ పరుగుల దాహాన్ని తీర్చుకున్నారు. ఇంకా చెప్పాలంటే.. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వని వారు.. టెస్ట్ మ్యాచును కాస్తా టీ20గా మార్చేశారు.
ఇంగ్లండ్ జట్టు గత కొంతకాలంగా 'బజ్‌బాల్' ప్లాన్‌తో ప్రత్యర్థులకి చుక్కలు చూపిస్తోన్న సంగతి తెలిసిందే. వన్డే, టీ20ల మాదిరి.. టెస్టుల్లోనూ దూకుడుగా ఆడటమే దీని ప్రత్యేకత. అదే జోరును ఐర్లాండ్‌పై కూడా కొనసాగించారు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టించారు. కేవలం 82.4 ఓవర్లలోనే 524 పరుగులు సాధించారు. 109 పరుగుల వద్ద తొలి వికెట్ పడితే.. ఆపై రెండో వికెట్ కోసం 361 పరుగుల వరకు ఆగాల్సి వచ్చింది. ఒకరకంగా వీరు ప్రేక్షకులకు కూడా విసుగు పుట్టించారు. ఈ మ్యాచులో ఓలీ పోప్ (208 బంతుల్లో 205; 22 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీ చేయగా, బెన్ డకెట్ (178 బంతుల్లో 182; 24 ఫోర్లు, సిక్స్) భారీ శతకం సాధించాడు. జాక్ క్రాలే (56), జో రూట్(56) అర్ధసెంచరీలతో రాణించారు.
బ్రెండన్ మెక్ కల్లమ్ వల్లే ఇదంతా..
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ ఎంతటి విధ్వంసకర ఆటగాడో అందరకీ విదితమే. న్యూజిలాండ్ తో మ్యాచ్ అంటే అతడి కట్టడిచేయడం ప్రత్యర్హ్టి బౌలర్లకు పెద్ద తలనొప్పిగా మారేది. ఒకసారి అతడు క్రీజులో కుదురుకున్నడంటే.. ఇన్నింగ్స్ ముగిసేలోపు మ్యాచ్ ఫలితం ఖరారైనట్లే. అలాంటి దూకుడైన మెక్ కల్లమ్ గతేడాది మేలో ఇంగ్లండ్ టెస్టు టీమ్ ప్రధాన కోచ్ గా బాధ్యతలు చేపట్టాడు. ఆనాటి నుంచి ఆ జట్టు రూపురేఖలు మారిపోయాయి. అదే సమయంలో యాషెస్ పరాభవంతో డీలాపడిన ఇంగ్లడ్ జట్టు పగ్గాలు బెన్ స్టోక్స్ అందుకున్నాడు.
ఇంకేముంది.. దూకుడైన స్టోక్స్ కు అదే తరహా మెక్ కల్లమ్ తోడవడంతో బజ్ బాల్ గేమ్ పురుడుపోసుకుంది. దీని ప్రకారం ప్రత్యర్థి బౌలర్ ఎవరా అన్నది చూడకుండా విరుచుకుపడుతూ ఆడాలి. అదే ఇంగ్లండ్ జట్టును విజయ పథంలో నడుస్తోంది.