ENG vs SL: అద్భుత విజ‌యం.. ఇంగ్లండ్ పొగరు అణిచిన లంకేయులు

టెస్టులను టీ20 తరహాలో ఆడుతూ "బజ్‌బాల్" అని పేరెట్టుకొని ఇంగ్లండ్ ఆటగాళ్లు చూపే అత్యుత్సాహం అందరికీ విదితమే. ఒకరకంగా ఈ దూకుడు వారికి మంచి మంచి విజయాలు కట్టబెట్టింది. ఆటలో వేగం పుంజుకోవడంతో టెస్ట్ మ్యాచ్‌లపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇవన్నీ పక్కన పెడితే ఇంగ్లీష్ క్రికెటర్లు అలవరిచిన బజ్ బాల్ కోటకు బీటలు వారాయి. సొంతగడ్డపై ఇంగ్లీష్ జట్టును ఓడించి లంకేయులు అద్భుత విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. 

విజయంతో ముగింపు

తొలి రెండు టెస్టుల్లో ఓటమి పాలైన లంక.. ఆఖరి టెస్టులో అద్భుత విజ‌యం సాధించింది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌‌ను మట్టికరిపించి తమ పని అయిపోయిందనుకుంటున్న దేశాలకు హెచ్చరికలు పంపింది. కెన్సింగ్‌ట‌న్ ఓవ‌ల్‌ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో లంక బ్యాటర్లదే పైచేయి. ఇంగ్లండ్ నిర్ధేశించిన 219 పరుగుల లక్ష్యాన్ని లంకేయులు కేవలం 40 ఓవర్లలో ఛేదించడం గమనార్హం. ఓపెనర్ ప‌థుమ్ నిశాంక (127 నాటౌట్: 124 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) శ‌త‌కంతో మెరిశాడు. అతనికి  కుశాల్ మెండిస్(39,) ఏంజెలో మాథ్యూస్(32  నాటౌట్‌) చక్కని సహకారం అందించారు.

సిరీస్ ఇంగ్లండ్ వశం

ఆఖరి టెస్టులో ఓడినప్పటికీ.. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆతిథ్య ఇంగ్లండ్ 2-1 తేడాతో తమ వశం చేసుకుంది.

సంక్షిప్త స్కోర్లు

  • ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 325 ఆలౌట్
  • శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 263 ఆలౌట్
  • ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 156 ఆలౌట్
  • శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 219/2