తెలంగాణ అంతట ఎంగిలిపూల సంబురం

తెలంగాణ అంతట ఎంగిలిపూల సంబురం
  • ఊరూరా ఘనంగా  మొదలైన బతుకమ్మ వేడుకలు 
  • ఉయ్యాల పాటలతో హోరెత్తుతున్న పల్లెపట్నం
  • వరంగల్ లో వెయ్యి స్తంభాల గుడి, ఉర్సు గుట్టకు పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు
  • హైదరాబాద్ లోని రవీంద్రభారతి, నెక్లెస్ రోడ్ లో వేడుకలు.. హాజరైన మంత్రి సీతక్క

హైదరాబాద్/వరంగల్, వెలుగు : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు బుధ‌‌‌‌వారం ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన సంబురాలు.. తొమ్మిది రోజుల పాటు క‌‌‌‌నుల‌‌‌‌ పండువ‌‌‌‌గా జరగనున్నాయి. మహిళలు ఊరూరా ఎంగిలిపూల బతుకమ్మలను పేర్చి, వేడుకలకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం తీరొక్క బ‌‌‌‌తుకమ్మలతో ఆయా గ్రామాల్లోని గుళ్లు, చెరువుల వ‌‌‌‌ద్దకు చేరుకుని ఆడిపాడారు. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..’,  ‘ఒక్కేసి పువ్వేసి చందమామ..’ అంటూ బతుకమ్మ పాటలతో సందడి చేశారు. 

కోలాటాలు, పాటలు, వాయినాలతో పూల పండుగకు అపూర్వ స్వాగతం పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో జరిగిన వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్​లోని పీపుల్స్ ప్లాజాలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్​) ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె గౌరమ్మకు పూజ చేసి బతుకమ్మ సంబురాలను ప్రారంభించారు. అనంతరం స్వయం సహాయక సంఘాల మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. 

ఈ సందర్భంగా సంప్రదాయ నృత్యాలు, బోనాలు, కోలాటాలతో మహిళలు సందడి చేశారు.  వేడుకల్లో మహిళా కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్రు శోభారాణి,  సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, పంచాయతీరాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్, కాంగ్రెస్ నేతలు రేగులపాటి రమ్యారావు, ఇందిరాశోభన్ పాల్గొన్నారు. 

రవీంద్రభారతిలో.. 

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని రవీంద్రభారతిలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఒక్కొక్క పువ్వేసి చందమామ’ బుక్ ను టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి ప్రసాద్ ఆవిష్కరించారు. 

వేడుకల్లో తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ అలేఖ్య పుంజాల, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాగా, వరంగల్ లో బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హనుమకొండలోని వెయ్యి స్తంభాల గుడి, వరంగల్ లోని ఉర్సు గుట్ట చెరువు వద్దకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

మహిళలను ప్రోత్సహించాలి : సీతక్క

బతుకమ్మ అంటేనే చెరువులను పూజించే పండుగ అని మంత్రి సీతక్క అన్నారు. ‘‘బతుకమ్మ పండుగతో చెరువులకు ప్రత్యేక అనుబంధం ఉంటుంది. వివిధ రకాల పూలు, పసుపులో ఉండే యాంటీబయాటిక్స్ చెరువులను శుద్ధి చేస్తాయి. బతుకమ్మ పండుగలో భాగమైన ఆటపాటలతో శరీరానికి మంచి వ్యాయామం అవుతుంది” అని చెప్పారు. 

మహిళలను స్వేచ్ఛగా బతుకమ్మ ఆడుకోనివ్వాలని, వాళ్లు జీవితంలో ఉన్నతంగా ఎదిగేలా ప్రోత్సహించాలని సూచించారు.  తెలంగాణ అంటే ముందుగా గుర్తుకొచ్చేది బతుకమ్మ పండుగేనని మహిళా కార్పొరేషన్ చైర్​పర్సన్ శోభారాణి అన్నారు.