నల్గొండ జిల్లా : మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఎంగిలిపువ్వు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు, మునుగోడు ఉప ఎన్నిక కమిటీ చైర్మన్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు.
ఈసందర్భంగా మునుగోడు చౌరస్తా నుంచి చండూరు రోడ్డు వరకు బతుకమ్మలతో మూడు వేల మంది మహిళలు ర్యాలీ నిర్వహించారు. చండూరు రోడ్డులోని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఆవరణలో బతుకమ్మ సంబరాలను అట్టహాసంగా నిర్వహించారు. బతుకమ్మ పాటల కోలాహలంతో పరిసర ప్రాంతాల్లో తెలంగాణ సాంస్కృతిక శోభ సంతరించుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా పండుగ బతుకమ్మ ఉత్సవాలు ఇవాళ్టి నుంచి మొదలయ్యాయి. పెత్రమాస నాడు ఎంగిలి పూల బతుకమ్మగా కొలువుదీరే ఈ పూల పండుగ... సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. రంగురంగుల పూలు.. చుట్టూ చేరి మహిళలు కొట్టే చప్పట్లు.. ఎంగిలి పూలతో మొదలు తొమ్మిది రోజులు తీరొక్క రుచులతో నైవేద్యాలు, ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాము ఆయే చందమామ అంటూ ఆడపడుచులు పాడే పాటలు అన్నీ కలగలిపి తెలంగాణ అస్తిత్వాన్ని తెలిపేలా సంబురాలు జరుగుతాయి.
9 రోజులు.. 9 రకాలుగా ఈ వేడుకలు జరుగుతాయి. బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్యతో ప్రారంభమవుతుంది. తంగేడు, గునుగు, బంతి, చామంతి వంటి తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి.. మహిళలంతా ఒకచోట చేరి ఆడిపాడతారు. ఇలా తొలి రోజున పేర్చిన బతుకమ్మను 'ఎంగిలిపూల బతుకమ్మ'గా పిలుస్తారు. రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగోరోజు నన్ను బియ్యం బతుకమ్మ.. ఐదోరోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ.. ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మగా జరుపుకుంటారు. ఆఖరుగా తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా వేడుకలు నిర్వహిస్తారు.