ఇట్ల సాగింది కృష్ణ నీళ్ల దోపిడీ

ఇట్ల సాగింది కృష్ణ నీళ్ల దోపిడీ

కళ్లకు కట్టినట్టు రాసిన దొంతుల లక్ష్మీ నారాయణ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుతో బీజం పడ్డ కృష్ణా నీళ్ల దోపిడీ దశాబ్దాల తరబడి కొనసాగుతున్న తీరును రిటైర్డ్ ఇంజనీర్, తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం కన్వీనర్ దొంతుల లక్ష్మీనారాయణ తన బుక్ ద్వారా కళ్లకు కట్టారు. ‘షేరింగ్ ఆఫ్ కృష్ణా రివర్ వాటర్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఇష్యూ – బయాస్ అండ్ డిస్పారిటీస్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ – సొల్యూషన్స్’ పేరుతో రాసిన పుస్తకంలో ఉమ్మడి ఏపీలో జరిగిన జల దోపిడీని సమగ్రంగా వివరించారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటా.. అందుకు అనుసరించాల్సిన ప్రమాణాలు, అంతర్జాతీయ, జాతీయ జల న్యాయ సూత్రాలను పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కృష్ణా నీళ్ల దోపిడీకి ఏపీ ప్రభుత్వం పన్నుతున్న కుట్రలను స్పష్టంగా రాశారు. మొత్తం ఐదు చాప్టర్లుగా తీసుకువచ్చిన ఈ పుస్తకం కృష్ణా జల వివాదాల సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించింది.

తెలంగాణ చరిత్ర, భౌగోళిక స్వరూపం, తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన కృష్ణా జలాల వాటా, అక్రమంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ, దానికి అదనంగా సంగమేశ్వరం వద్ద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం తలపెట్టడం, దక్షిణ తెలంగాణ జిల్లాల దయనీయ పరిస్థితి, రాష్ట్రంలోని మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల వివరాలు.. నీటి లెక్కింపునకు అనుసరించే శాస్త్రీయ పద్ధతులు తదితర అంశాలను ఈ పుస్తకంలో సమగ్రంగా వివరించారు.
నది పారే ఏరియా తెలంగాణలోనే ఎక్కువ, కానీ.. పుస్తకం రెండో చాప్టర్లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటా.. ఏయే ప్రాజెక్టులకు ఎంత కేటాయింపులు చేయాల్సి ఉంది. ఏపీకి సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా దక్కిన వాటా ఇతర అన్ని వివరాలను తెలియజెప్పారు. క్యాచ్మెంట్ ఏరియా (పరీవాహక ప్రాంతం) ఆధారంగా రీజనబుల్ అండ్ ఈక్విటబుల్ షేర్ ప్రకారం నీటి పంపకాలు ఉండాలని అనేక సందర్భాల్లో అంతర్జాతీయ, జాతీయ ట్రిబ్యునళ్లు తీర్పు చెప్పాయి. తెలంగాణలో కృష్ణా నది 68.5 శాతం ప్రవహిస్తుంటే కేవలం 37 శాతం నీటిని మాత్రమే కేటాయించారు. ఏపీలో 31.5 శాతం పరీవాహక ప్రాంతమే ఉన్నా 63 శాతం నీటిని కేటాయించారు. ఉమ్మడి రాష్ట్ర ఏర్పాటుతోనే కృష్ణా నీళ్ల పంపకాల్లో తెలంగాణ ప్రాంతానికి నష్టం మొదలైంది.

కేటాయింపులపై ఆంధ్ర పాలకుల కుట్ర

నిజాం పాలనలో భీమా (100 టీఎంసీలు), అప్పర్ కృష్ణా(54 టీఎంసీలు), తుంగభద్ర కుడికాలువ విస్తరణ (20 టీఎంసీలు) ప్రాజెక్టులు తలపెట్టారు. మద్రాస్ స్టేట్తో ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. సుంకేసుల బ్యారేజీ నిర్మాణ సమయంలోనూ రెండు రాష్ట్రాలు సమానంగా నీటిని పంచుకోవాలని ఒప్పందం చేసుకున్నాయి. కానీ సుంకేసుల నుంచి ఏపీ 39 టీఎంసీల నీటిని ఉపయోగించుకుంటుంటే తెలంగాణకు ఆర్డీఎస్ కింద 15.9 టీఎంసీల కేటాయింపులు మాత్రమే దక్కాయి. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావంతో నిజాం తలపెట్టిన ప్రాజెక్టులను ఆపేసి, ఆ ప్రాజెక్టులకు బచావత్ అవార్డులో కేటాయింపులు చేయకుండా నాటి ఆంధ్రా పాలకులు కుట్ర పన్నారు. నాగార్జునసాగర్లో తెలంగాణ, ఆంధ్రకు 132 టీఎంసీల చొప్పున కేటాయించాల్సి ఉండగా, ఏపీకి 174 టీఎంసీలు, తెలంగాణకు 100 టీఎంసీలు మాత్రమే కేటాయించారు. ఫలితంగా తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన 210.3 టీఎంసీల వాటా కోల్పోవాల్సి వచ్చింది.

మద్రాస్ కు తాగునీటి మాటున దోపిడీకి తెరలేపిన్రు

మద్రాస్ (ప్రస్తుత చెన్నై) నగరానికి తాగునీటి మాటున ఆంధ్ర పాలకులు శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్ల దోపిడీకి తెరతీశారు. అక్రమంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్ పేరుతో రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించే కొత్త ప్రాజెక్టు పనులను మూడో చాప్టర్లో వివరించారు. 1977లో మద్రాస్ కు మహారాష్ట్ర, కర్నాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 5 టీఎంసీల చొప్పున 15 టీఎంసీలు శ్రీశైలం నుంచి ఇచ్చేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాయి. రోజుకు 1,500 క్యూసెక్కుల చొప్పున 120 రోజుల్లో 15.5 టీఎంసీలు గ్రావిటీ ద్వారా తీసుకెళ్లేందుకు అంగీకారం తెలిపారు. 1983లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక తెలుగుగంగ పేరుతో చెన్నై డ్రింకింగ్ వాటర్ సిస్టం అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడే ఆంధ్రా పాలకులు తమ దోపిడీకి తెరతీశారు. రోజుకు 1,500 క్యూసెక్కుల నీటిని మాత్రమే డ్రా చేసేలా నిర్మించాల్సిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను కుట్రపూరితంగా 11,500 (ఒక టీఎంసీ) క్యూసెక్కులు తరలించేలా నిర్మించారు. మూడు గేట్లకు అదనంగా రోజుకు 5 వేల క్యూసెక్కుల నీటిని డ్రా చేసేలా స్టాండ్ బై గేటును ఏర్పాటు చేసి శ్రీశైలం నీళ్ల దోపిడీకి అప్పుడే స్కెచ్ వేశారు.

15 టీఎంసీలతో మొదలై వందల టీంఎసీల దోపిడీ

చెన్నైకి తాగునీటి పేరుతో 15 టీఎంసీలను డ్రా చేయడం మొదలు పెట్టిన ఆంధ్రా పాలకులు తర్వాత అక్రమ ప్రాజెక్టుల ద్వారా నేడు వందల టీఎంసీల నీటిని దోచుకుంటున్నారు. పోతిరెడ్డిపాడు నుంచి తరలించే నీటిని నిల్వ చేసుకోవడానికి రాయలసీమలో 364 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించారు. తెలుగుగంగ (29 టీఎంసీలు), హంద్రీనీవా (40 టీఎంసీలు), గాలేరు నగరి (38 టీఎంసీలు), వెలిగొండ ప్రాజెక్టు (43.50 టీఎంసీలు), రాయలసీమ తాగునీటికి 10 టీఎంసీలు, కేసీ కెనాల్కు 10 టీఎంసీలు, ఎస్సార్బీసీ (19 టీఎంసీలు), చెన్నై తాగునీటికి 15 టీఎంసీలు కలుపుకొని మొత్తం 204.5 టీఎంసీలు శ్రీశైలం నుంచే మళ్లిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పక్కనే కొత్తగా 44 వేల క్యూసెక్కుల తరలించేలా మరో రెగ్యులేటర్ నిర్మించారు. పది మీటర్ల పొడవు 8.57 మీటర్ల వెడల్పుతో 10 గేట్లు ఏర్పాటు చేశారు. వీటిలో 9 గేట్ల ద్వారా రోజుకు 44 వేల క్యూసెక్కులు తరలిస్తామని, పదో గేటు స్టాండ్ బై అని అప్పట్లో పాలకులు చెప్పారు. రెండు రెగ్యులేటర్ల ఒక్కో స్టాండ్ బై గేటు ఏర్పాటు చేసిన పాలకులు వాటి ద్వారానే రోజుకు 10 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం (885 అడుగులు)తో ఉన్నప్పుడు కేవలం కొత్త హెడ్ రెగ్యులేటర్ ద్వారానే రోజుకు 10.15 టీఎంసీల నీటిని గ్రావిటీ ద్వారా తరలించవచ్చని బుక్లో సవివరంగా తెలియజెప్పారు. 880 అడుగుల లెవల్ లో ఉన్నప్పుడు 6 టీఎంసీలు, 854 లెవల్ లో ఉన్నప్పుడు 4.2 టీఎంసీలు గ్రావిటీ ద్వారా తరలించుకునే అవకాశం ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం శ్రీశైలంలో 881 లెవల్ ఉంటే తప్ప పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కెపాసిటీ మేరకు నీటిని తరలించుకోగలమనే వాదన తప్పని గణాంకాలతో సహా నిరూపించారు. పాత హెడ్ రెగ్యులేటర్ ద్వారా రోజుకు ఒక టీఎంసీ, స్టాండ్ బై గేట్ల ద్వారా మరో టీఎంసీ, పవర్ స్లూయిజ్ గేట్ ద్వారా 5,500 క్యూసెక్కులు (అర టీఎంసీ), వెలిగొండ టన్నెల్ ప్రాజెక్టు ద్వారా ఒక టీఎంసీ, హంద్రీనీవా, ముచ్చుమర్రి లిఫ్ట్ స్కీంల ద్వారా ఇంకో అర టీఎంసీ మొత్తం కలిపి రోజుకు 8 టీఎంసీలకు పైగా నీటిని తరలించేలా ఏపీ ఏర్పాటు చేసుకుంది. ఇది శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగుల వరకు ఉన్నప్పుడు మాత్రమే. ఫుల్ రిజర్వాయర్ లెవల్ ఉన్నప్పుడు లిఫ్టులతో నిమిత్తం లేకుండానే రెగ్యులేటర్ గేట్ల ద్వారానే 15 టీఎంసీలు తీసుకునే ఆస్కారం ఉందని లక్ష్మీ నారాయణ తెలియజేశారు.

నేల బీడు, ఫ్లోరైడ్ బాధలు, రీడిజైనింగ్ లోపాలు

కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కక నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ రక్కసికి కొన్ని తరాలు బలైపోయిన తీరును ఫొటోలతో పాటు పుస్తకంలో పెట్టారు. బుక్ నాలుగో చాప్టర్లో తెలంగాణలోని కృష్ణా బేసిన్ కు జరిగిన నష్టాన్ని సమగ్రంగా తెలియజేశారు. కృష్ణా బేసిన్ లోని మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు నికర జలాల్లో వాటా దొరక్క ఏ రీతిన బీడుబారాయో వివరించారు. తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల సమగ్ర స్వరూపాన్ని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాజెక్టులు ఎలా నిర్లక్ష్యానికి గురయ్యాయో తెలియజేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు మన పాలకుల నిర్లక్ష్యానికి గురైన దుస్థితిని వివరించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రాజెక్టుల రీ డిజైనింగ్ లో ఉన్న లోపాలను వివరిస్తూ సీఎం కేసీఆర్కు రాసిన లెటర్లను పుస్తకంలో ప్రచురించారు. తెలంగాణకు ఏ ప్రాజెక్టులు చేపడితే ఉపయోగకరమో చెప్తూ రాసిన లేఖలను ప్రజలకు తెలిసేలా చేశారు. పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ స్కీంను రోజుకు 2 టీఎంసీల నుంచి ఒక్క టీఎంసీకి కుదిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ప్రజలకు తెలిసేలా చేశారు.

రాష్ట్రంలోని మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల సమగ్ర స్వరూపాన్ని దొంతుల లక్ష్మీ నారాయణ ఐదో చాప్టర్ లో సంపూర్ణంగా తెలియజేశారు. తెలంగాణ చరిత్రతో ఈ పుస్తకాన్ని మొదలు పెట్టి రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల చరిత్రను వివరిస్తూ ముగించారు. కృష్ణా జలాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ఫొటోలు, గణాంకాలతో సహా సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యే రీతిలో వివరించారు.

ఏపీకి తగ్గించాల్సిన కేటాయింపులివీ..

రీజినబుల్ అండ్ ఈక్విటబుల్ షేర్ ప్రకారం క్యాచ్మెంట్ ఏరియా ఆధారంగా ఏపీకి 316.58, తెలంగాణ కు 688.42 టీఎంసీల నికర జలాలు రావాలి. ఏపీకి ప్రస్తుతం ఉన్న కేటాయింపుల్లో ఏయే ప్రాజెక్టులకు వాటా తగ్గించాలో కూడా దొంతుల లక్ష్మీనారాయణ తన పుస్తకంలో సూచించారు. కృష్ణా డెల్టా సిస్టమ్కు 152.2 టీఎంసీల కేటాయింపులుండగా 41.8 టీఎంసీలు సరిపోతాయన్నారు. గ్రౌండ్ వాటర్ సప్లిమెంటేషన్ ద్వారా 20% అంటే 30.4 టీఎంసీలు, పోలవరం నుంచి మళ్లించే 80 టీఎంసీలను మినహాయిస్తే మిగతా నీటిని పులిచింతల నుంచి కృష్ణా డెల్టా సిస్టమ్కు ఉపయోగించుకోవచ్చని వివరించారు. నాగార్జునసాగర్లో 174 టీఎంసీల కేటాయింపులకు గాను 107.3 టీఎంసీలు సరిపోతాయని, గ్రౌండ్ వాటర్ సప్లిమెంటేషన్ ద్వారా 35 టీఎంసీలు, ఎడమ కాలువ నుంచి తీసుకునే 32 టీఎంసీలు మినహాయించాలని సూచించారు. రాయలసీమకు 144 టీఎంసీలు మళ్లిస్తుండగా, 125.7 టీఎంసీలు సరిపోతాయన్నారు. మొత్తంగా ఏపీ పరివాహక ప్రాంతం ఆధారంగా 316.58 టీఎంసీలు కేటాయిస్తే చాలని వివరించారు. తెలంగాణకు 688.42 టీఎంసీల కేటాయింపులు చేయాల్సి ఉంటుందని సూచించారు. ఇందులో నికర జలాలు 299 టీఎంసీలు కాగా సర్ ప్లస్ వాటర్ 289.4 టీఎంసీలు, తాగునీటి కోసం 100 టీఎంసీలు కేటాయించాల్సి ఉందని తెలిపారు.

సంగమేశ్వరం పూర్తయితే ఖతం

ఇప్పుడు కొత్తగా శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల లెవల్లో నీళ్లు ఉన్నప్పటి నుంచే రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి ఏపీ సంగమేశ్వరం లిఫ్ట్ స్కీం నిర్మిస్తోంది. సంగమేశ్వరం లిఫ్ట్ పూర్తయితే దక్షిణ తెలంగాణకు సాగు నీరు అందక పంట భూములు ఎడారిగా మారుతాయని, హైదరాబాద్ సిటీకి తాగునీరు అందక అల్లాడే పరిస్థితి వస్తుందని రచయిత ఆధారాలతో వివరించారు. తెలంగాణలో నికర జలాలపై ఆధారపడ్డ 20.38 లక్షల ఎకరాలతో పాటు మిగులు జలాలపై ఆధారపడి నిర్మిస్తున్న ప్రాజెక్టుల కింద ఇంకో లక్ష ఎకరాలు మొత్తంగా 45.38 లక్షల ఎకరాలు ఎడారిగా మారిపోతాయని లక్ష్మీ నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టానికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం పెన్నా బేసిన్లో కృష్ణా నీళ్లపై ఆధారపడి నిర్మించిన ప్రాజెక్టులు, వాటికి శ్రీశైలం నుంచి నీటిని మళ్లించే విధానాన్ని ఫొటోలతో సహా అందరికీ అర్థమయ్యేట్టు తెలిపారు. – కామెర నవీన్ కుమార్ వెలుగు ప్రతినిధి