- రూ.50 లక్షలు సుపారీ ఇచ్చిన పార్ట్నర్స్
- బాధితుడి ఫిర్యాదు
- 12మందిపై కేసు నమోదు ఏడుగురు అరెస్ట్
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ ఇంజినీరింగ్ కాలేజీ కరస్పాండెంట్ ను చంపడానికి అతడి పార్ట్నర్స్ సుపారీ ఇచ్చారు. అయితే, హత్యాయత్నం విఫలం కావడం, బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుట్టు రట్టయ్యింది. ఘటనతో సంబంధం ఉన్న12 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. చిలుకూరు మండలం రామాపురంలోని గేట్ ఇంజినీరింగ్ కాలేజీకి బుద్దే కాంతారావు కరస్పాండెంట్ గా ఉన్నారు. కాలేజీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో కాంతారావుకు... మిగతా పార్ట్నర్స్ తొగరు శ్రీనివాస్, బాదే ఆంజనేయులు, బాదే రాజారావు, బుద్దె రామ్మూర్తి, నీలా సత్యనారాయణ, పోకల శ్రీనివాసరావు, గన్నా నాగేశ్వరావుతో విభేదాలున్నాయి. దీంతో కాంతారావును హత్య చేయాలని వారు నిర్ణయించుకున్నారు.
రెండు సార్లు విఫలయత్నం
సూర్యాపేటకు చెందిన చందా కోటేశ్ , బాదే లింగయ్యల ద్వారా రాము అనే పాత నేరస్తున్ని సంప్రదించిన కాంతారావు పార్ట్నర్స్ రూ.50లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. అందులో రూ.5 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చారు. ఈ నెల 19న కారులో సూర్యాపేట వెళ్లి వస్తున్న కాంతారావును మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద డీసీఎంతో ఢీ కొట్టి చంపేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. తిరిగి అదే రోజు సాయంత్రం కారులో కాలేజీకి వెళ్తుండగా మరోసారి ఢీ కొట్టాలని చూసి ఫెయిలయ్యారు. ఈ రెండు ఘటనలతో అనుమానం వచ్చిన కాంతారావు తనను ఎవరో చంపాలని చూస్తున్నారని కోదాడ టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
దీంతో విచారణ ప్రారంభించిన పోలీసులు కాలేజీలో ఆయన పార్ట్నర్స్ హత్య చేసేందుకు సుపారీ ఇచ్చినట్లు గుర్తించారు. కొర్రా రామ్ కుమార్, భైరు వెంకటేశ్వర్లు , పెండ్ర రాము, బాదే లింగయ్య, తొగరు శ్రీనివాస రావు, బుద్దె రామ్మూర్తి, నీలా సత్యనారాయణను అరెస్ట్చేశారు. చందా కోటేశ్, బాదే ఆంజనేయులు, బాదే రాజారావు, పోకల శ్రీనివాసరావు , గన్నా నాగేశ్వర్ రావు పరారీలో ఉన్నారని చెప్పారు.