- ఒక్కో గ్రూప్‌లోని సీటుకు.. ఒక్కో రేటు
- సీఎస్ఈకి రూ.5 లక్షల నుంచి రూ.18 లక్షలు
- ఇంకా షురూ కాని కన్వీనర్ కోటా అడ్మిషన్లు
- అప్పుడే మేనేజ్ మెంట్ సీట్ల అమ్మకాలు ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్ల అడ్మిషన్ల ప్రక్రియ మొదలుగాక ముందే.. మేనేజ్మెంట్ కోటా సీట్ల బేరసారాలు షురూ అయ్యాయి. ఒక్కో గ్రూపులోని సీటుకు ఒక్కో రేటు ఫిక్స్ చేశారు. ప్రధానంగా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సీట్లకు రూ.5 లక్షల నుంచి రూ.18 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. ఇదంతా ఓపెన్ గానే జరుగుతున్నా.. అటు హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారులు గానీ.. ఇటు యూనివర్సిటీ ఆఫీసర్లు గానీ పట్టించుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 170 ప్రైవేటు కాలేజీలు ఉండగా.. వాటిలో లక్షకు పైగా సీట్లు ఉన్నాయి.
ఇంకా ఏఐసీటీఈ నుంచి కాలేజీలు, కోర్సులకు పూర్తి స్థాయిలో అనుమతులు రాలేదు. జేఎన్టీయూ, ఓయూ తదితర కాలేజీలు వాటికి గుర్తింపు ఇవ్వలేదు. ఈ నెల 27 నుంచి ఎంసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. అయినా, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు మాత్రం ఏకంగా మేనేజ్ మెంట్ సీట్ల అమ్మకాలు ప్రారంభించాయి. మేనేజ్ మెంట్ కోటా సీట్ల భర్తీకి విద్యాశాఖ స్పెషల్‌గా షెడ్యూల్ ఇస్తుంది. ఆ షెడ్యూల్ కూడా ఇంకా రిలీజ్ గాకముందే ప్రైవేటు కాలేజీల మేనేజ్ మెంట్లు అక్రమాలకు తెరలేపాయి.
ఎవరు ముందొచ్చి ఎక్కువ డబ్బులిస్తే వారికే..
ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తుండగా, మిగిలిన 30 శాతం సీట్లను మేనేజ్ మెంట్ కోటాలో భర్తీ చేస్తారు. మేనేజ్ మెంట్ కోటా సీట్లను జేఈఈ, ఎంసెట్ ర్యాంకుల మెరిట్ ఆధారంగానే కేటాయించాలి. మేనేజ్ మెంట్ కోటా సీట్లను నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతే భర్తీ చేయాల్సి ఉంటుంది. ముందుగా విద్యార్థుల నుంచి దరఖాస్తులు తీసుకొని వారిలో మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించాల్సి ఉన్నా.. కాలేజీల మేనేజ్ మెంట్లు అవేవీ పట్టించుకోవడం లేదు. ఎవరు ముందొచ్చి.. డబ్బులు ఎక్కువ ఇస్తామంటే వారికే సీట్లను కేటాయిస్తున్నాయి.
డిమాండ్‌ను బట్టి క్యాష్ చేస్కుంటున్న మేనేజ్మెంట్లు
ప్రస్తుతం ఇంజినీరింగ్ లో కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సులకు ఫుల్ డిమాండ్ ఉంది. దీన్ని మేనేజ్ మెంట్లు క్యాష్ చేసుకుంటున్నాయి. ఇంజినీరింగ్‌లో 1.80 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో లక్షకు పైగా స్టూడెంట్లు కేవలం కంప్యూటర్ సైన్స్ సీట్లను కోరుకుంటున్నారు. దీంతో మేనేజ్ మెంట్లు కృత్రిమ కొరతను సృష్టించి ఫీజులు పెంచుతున్నాయి. మాములు కాలేజీల్లో కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సులకు రూ.5 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. పేరున్న ఇంజినీరింగ్ కాలేజీల్లో రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజ్ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) నిబంధనల ప్రకారం కన్వీనర్ కోటాకు నిర్ణయించిన ఫీజును మాత్రమే మేనేజ్ మెంట్ కోటాకు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, మేనేజ్ మెంట్లు అవేవీ పట్టించుకోవడం లేదు.
అడ్మిషన్లు చేపడితే చర్యలు
ఇప్పటి వరకు ఇంజినీరింగ్ కాలేజీల్లో ‘బీ’ కేటగిరి సీట్ల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు. కాలేజీలు నోటిఫికేషన్ ఆధారంగానే సీట్లను భర్తీ చేయాలి. విచ్చలవిడిగా సీట్లను ముందుగా నింపొద్దు. ముందస్తు అడ్మిషన్లు చేపడితే కఠిన చర్యలు తీస్కుంటం. - ప్రొఫెసర్ లింబాద్రి,
టీజీసీహెచ్ఈ చైర్మన్
ఆన్లైన్లో అడ్మిషన్లు చేపట్టాలి
ఇంజినీరింగ్ కాలేజీల్లో ఇష్టానుసారం అడ్మిషన్లు చేస్తున్నరు. నిబంధనలకు విరుద్ధంగా లక్షల్లో ఫీజులు, డొనేషన్లు వసూలు చేస్తున్నారు. ఇలాంటి కాలేజీల మేనేజ్ మెంట్లపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ఎంబీబీఎస్ మేనేజ్ మెంట్ సీట్లను ఆన్లైన్ లో భర్తీ చేసినట్లే.. ఇంజినీరింగ్ ‘బీ’ కేటగిరి సీట్లనూ ఆన్లైన్లో భర్తీ చేయాలి
నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి