- మొత్తం 175 కాలేజీల్లో 109 రాజధాని చుట్టుపక్కలే
- పట్నంలో చదివితేనే జాబ్ అనే ధోరణిలో స్టూడెంట్లు
- 3, 4 ఉమ్మడి జిల్లాలు మినహా మిగతా చోట్ల కనిపించని కాలేజీలు
- విద్యార్థులు తప్పనిసరిగా సిటీకి రావాల్సిన దుస్థితి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీలు గ్రేటర్ హైదరాబాద్ దాటి బయటకు పోవడం లేదు. మొత్తం కాలేజీల్లో 62 శాతం కాలేజీలు గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నాయి. మూడు, నాలుగు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మినహా మిగిలిన చోట కనిపించడం లేదు. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఒక్క కాలేజీ కూడా లేదు. జిల్లాకో సర్కారు ఇంజినీరింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించినా.. ఆ హామీని అమలు చేయలేదు.
రాష్ట్రవ్యాప్తంగా 175 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో 19 సర్కారు కాలేజీలు కాగా, 156 కాలేజీలు ప్రైవేటువి. ప్రస్తుతం వీటిలో 1,12,069 సీట్లున్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 45 కాలేజీలుఉండగా, రంగారెడ్డి జిల్లాలో 44, హైదరాబాద్ జిల్లాలో 20 కాలేజీలు ఉన్నాయి. ఈ లెక్కన మొత్తం 175 కాలేజీలకు 109 కాలేజీలు గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నాయి. మరోపక్క ప్రధానమైన పేరున్న కాలేజీలూ ఇక్కడే ఉండటంతో ఇతర జిల్లాలు, రూరల్ ఏరియాల నుంచి విద్యార్థులు పట్నంబాట పడుతున్నారు.
వరంగల్, ఖమ్మం, కరీంనగర్ తదితర ఉమ్మడి జిల్లాల్లో డబుల్ డిజిట్ కాలేజీలు ఉండగా, మిగిలిన చాలా చోట్ల సింగిల్ డిజిట్ లోనే ఉన్నాయి. ఎక్కువ కాలేజీలు గ్రేటర్ హైదరాబాద్, దాని చుట్టుపక్కలే ఉండడంతో రూరల్ జిల్లాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనివార్యంగా వారు సిటీకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే పట్నంలో చదివితేనే ఉద్యోగం వస్తుందన్న ధోరణిలో స్టూడెంట్లు ఉన్నారు.
8 జిల్లాల్లో ఒక్కటీ లేదు..
ప్రస్తుతం 33 జిల్లాలుంటే వాటిలో 25 జిల్లాల్లోనే ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. 8 జిల్లాల్లో ఒక్క కాలేజీ లేకపోగా.. 10 జిల్లాల్లో ఒక్కో కాలేజీ చొప్పున ఉన్నాయి. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, జోగుళాంబ గద్వాల, నాగర్ కర్నూల్, ములుగు, నారాయణపేటలో ఒక్క ఇంజినీరింగ్ కాలేజీ కూడా లేదు.
మంచిర్యాల, జగిత్యాల, మహబూబాబాద్, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, వనపర్తి జిల్లాల్లో ఒక్కో కాలేజీ చొప్పున ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా నారాయణపేటకు ఇంజినీరింగ్ కాలేజీ వచ్చింది. అయితే గతంలో రూరల్ ఏరియాల్లో అక్కడక్కడ కాలేజీలు ఉన్నా.. వాటిలో స్టూడెంట్లు పెద్దగా చేరలేదు. దీంతో ఆయా కాలేజీల్లో కొన్ని మూతపడగా, కొన్ని ఇతర
ప్రాంతాలకు మారాయి.
తగ్గుతున్న ప్రైవేటు కాలేజీలు
రాష్ట్రంలో ప్రైవేటు కాలేజీలు క్రమంగా తగ్గుతుండగా, సర్కారు కాలేజీలు పెరుగుతున్నాయి. గత ప్రభుత్వం జిల్లాకు ఒక ఇంజినీరింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తామని ప్రకటించినా, ఆ దిశగా కృషి చేయలేదనే విమర్శలు ఉన్నాయి. కాగా, గడిచిన ఐదేండ్లలో ఐదు సర్కారు కాలేజీలను కొత్తగా ఏర్పాటు చేశారు. 2020–21లో 14 కాలేజీలు ఉంటే.. ప్రస్తుతం ఆ సంఖ్య 19కి చేరింది. మరోపక్క ఐదేండ్లలో ప్రైవేటు కాలేజీలు 11కు తగ్గాయి. ఇవన్నీ దాదాపు రూరల్ ఏరియాలోనివేనని అధికారులు తెలిపారు