- క్రషర్ గుంతలో పడి ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
- ఘట్ కేసర్ పరిధి అన్నోజిగూడలో ఘటన
ఘట్ కేసర్, వెలుగు : సరదాగా సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు క్రషర్ గుంతలో పడి ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ చనిపోయాడు. పోచారం ఐటీసీ ఇన్ స్పెక్టర్ రాజువర్మ తెలిపిన ప్రకారం... ఏపీలోని ఏలూరుకు చెందిన యశ్వంత్ ఘట్ కేసర్ చౌదరిగూడ పంచాయతీ పరిధిలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం మరో ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి యశ్వంత్ అన్నోజిగూడ లోని క్రషర్ గుంత వద్దకు వెళ్లారు. సరదాగా అందరూ కలిసి సెల్ఫీ దిగుతుండగా యశ్వంత్ ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయాడు.
మిగతా ఫ్రెండ్స్ అతడిని కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి గాలింపు చేపట్టారు. ఎస్ఐ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ఎఫ్ టీమ్ యశ్వంత్ డెడ్ బాడీ కోసం వరకు గాలింపు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. క్రషర్ ఓనర్ నిర్లక్ష్యంతో ఇప్పటికే చాలా మంది యువకులు నీటి గుంతలో పడి మృతి చెందారు. అయినా కనీస జాగ్రత్తలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న క్రషర్ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.