అన్నారం బ్యారేజీలో ఇసుక మేటలు !

అన్నారం బ్యారేజీలో ఇసుక మేటలు !
  • 18 పిల్లర్ల చుట్టూ ఇసుకే
  • తొలగించాలని టీఎస్‌‌‌‌‌‌‌‌ఎండీసీకి లెటర్‌‌‌‌‌‌‌‌ రాసిన ఇంజినీర్లు

జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు : ఇటీవల కురిసిన వర్షాలకు గోదావరి పొంగి ప్రవహించడంతో అన్నారం బ్యారేజీలో భారీగా ఇసుక మేటలు వేశాయి. 18 పిల్లర్ల చుట్టూ సుమారు ఐదారు మీటర్ల లోతు వరకు ఇసుకే కనిపిస్తోంది. దీంతో గేట్లు ఆపరేట్‌‌‌‌‌‌‌‌ చేయడానికి వీలు లేకుండా పోయింది. బ్యారేజీలోని ఇసుక మేటలు తొలగించాలని టీఎస్‌‌‌‌‌‌‌‌ఎండీసీకి ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్లు లెటర్‌‌‌‌‌‌‌‌ రాశారు. గతేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 21న మేడిగడ్డ బ్యారేజీ భూమిలోకి కుంగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో బుంగలు బయటపడ్డాయి. 

దీంతో నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్యామ్‌‌‌‌‌‌‌‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ) టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ వానాకాలం పూర్తయ్యేదాకా మూడు బ్యారేజీల గేట్లను తెరిచే ఉంచాలని, వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు పంపించాలని ఆదేశించింది. తాము మళ్లీ ఆదేశాలు జారీ చేసే వరకు బ్యారేజీలో నీటిని నిల్వ చేయొద్దని ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. దీంతో రాష్ట్ర ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ ఇంజినీర్లు మూడు బ్యారేజీల గేట్లను తెరిచి ఉంచారు. ఎస్సారెస్పీ నుంచి ఎల్లంపల్లి వరకు బ్యారేజీ గేట్లను తెరిచి గోదావరి వరదను దిగువకు విడిచిపెట్టారు. 

మానేరు వాగుతో పాటు ఇతర 31 చిన్న, చిన్న వాగుల నుంచి వరద అన్నారం బ్యారేజీకి చేరింది. బ్యారేజీ పొడవు 1,250 మీటర్లు ఉండగా మొత్తం 66 గేట్లు ఉన్నాయి.  వీటిలో 18 పిల్లర్ల దగ్గర భారీగా ఇసుక మేటలు వేసినట్టు ఇంజినీర్లు తెలిపారు. ఏటవాలుగా వచ్చే వరద ప్రవాహం ఒక వైపు నుంచి వెళ్లడం వల్ల అటువైపు ఇసుక మేటలు వేసినట్లు చెప్తున్నారు. గేట్లన్నీ తెరిచి ఉంచడం వల్ల ఇసుక మేటలు ఎక్కువ అయినట్లు తెలిపారు. పిల్లర్ల దగ్గరి నుంచి సుమారు 2, 3 కిలోమీటర్ల దూరం వరకు  సుక మేటలున్నాయి. ఈ ఇసుకను తొలగిస్తే తప్ప గేట్లను ఆపరేట్ చేయడానికి వీలుకాదని ఇంజినీర్లు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. 

ఇసుక సమస్య తొలగేనా ?

అన్నారం బ్యారేజీని మొదటి నుంచి ఇసుక సమస్య వేధిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో భాగంగా మహదేవ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ మండలం అన్నారం గ్రామ సమీపంలో రూ.2,147 కోట్లతో 10.87 టీఎంసీల కెపాసిటీతో సరస్వతి (అన్నారం) బ్యారేజీ నిర్మించారు. మేడిగడ్డ బ్యారేజీ నీటిని కన్నెపల్లి పంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దగ్గర మోటార్లను స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి అన్నారం బ్యారేజీకి రివర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తారు. అన్నారం బ్యారేజీ నీటిని రివర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపింగ్‌‌‌‌‌‌‌‌ ద్వారా సుందిళ్ల (పార్వతి) బ్యారేజీలోకి పంపిస్తారు. .

ఈ బ్యారేజీ నిర్మాణ సమయంలోనే ఇక్కడ ఇసుక మేటల సమస్య వస్తుందని ఇంజినీర్లు గుర్తించినా అప్పటి ప్రభుత్వం హడావుడిగా పనులు చేయడంతో ఇసుక సమస్యను నివారించే అంశంపై దృష్టి పెట్టలేదు. 2020–21లో బ్యారేజీలో ఇసుక మేటలు వేస్తే తొలగించారు. ఈ సారి గేట్లు తెరిచి ఉంచినప్పటికీ బ్యారేజీకి మళ్లీ ఇసుక సమస్య ఉత్పన్నమైంది. బ్యారేజీలో ఇసుక నిల్వలు భారీగా పేరుకుపోయాయని, తొలగించాలని టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీసీని కోరినట్లు ఇంజనీర్లు  తెలిపారు. బ్యారేజీకి ఇసుకతో పొంచి ఉన్న ముప్పును తొలగించడానికి అదనంగా కొన్ని పనులు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని కొత్త ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆఫీసర్లు తెలిపారు.