ఐదేండ్లుగా నిర్లక్ష్యం ప్రమాదకరంగా సొరంగం!..బీఆర్‌ఎస్ హయాంలో ఏండ్లుగా పనులు పెండింగ్

ఐదేండ్లుగా నిర్లక్ష్యం ప్రమాదకరంగా సొరంగం!..బీఆర్‌ఎస్ హయాంలో ఏండ్లుగా పనులు పెండింగ్
  • రెండో టర్మ్‌లో పైసా ఇవ్వలే   
  • పనులు చేయకపోవడంతో భారీగా పెరిగిన సీపేజ్ 
  • నిమిషానికి పది వేల లీటర్ల నీళ్లు లీకేజ్ .. సిమెంట్ గ్రౌటింగ్ చేసినా నిలవలే.. 
  • అప్పట్లోనే శ్రద్ధ పెట్టి పని చేసి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదనే అభిప్రాయాలు  

హైదరాబాద్, వెలుగు :  గత బీఆర్‌ఎస్ పాలకుల నిర్లక్ష్యం ఎస్ఎల్​బీసీ ప్రాజెక్టుకు శాపంగా మారింది. ఏండ్లుగా పనులు పెండింగ్​పెట్టడంతో  ప్రమాదకరంగా తయారైందని ఇంజినీర్లు చెప్తున్నారు. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో మొదలైన ఈ సొరంగం‌ పనులు.. గత ఉమ్మడి పాలకుల అలక్ష్యం, ఆ తర్వాత స్వ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పాలకుల నిర్లక్ష్యంతో ఇలా 20 ఏండ్ల పాటు సాగదీతకు గురైంది.  

ఉమ్మడి పాలకులు వాళ్ల స్వార్థం కోసం  పను లు పెండింగ్​పెట్టారు.  2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ సైతం నిధులు విడుదల చేయకుండా అడుగడుగునా ప్రాజెక్టుపై వివక్ష చూపించింది. తొలినాళ్లలో కొంత మేర సొరంగం పనులు చేసినా.. రెండో టర్మ్‌‌లో మాత్రం పూర్తిగా పక్కన పెట్టింది.

రూ.10 కోట్లకు మించి ఇవ్వలే.. 

బీఆర్‌ఎస్ రెండో టర్మ్‌లో  ఎస్​ఎల్​బీసీ ప్రాజెక్టుకు ఏ బడ్జెట్​లోనూ రూ.10 కోట్ల కన్నా ఎక్కువ నిధులను  కేటాయించలేదు. రూ.1925 కోట్ల అంచనాలతో 43.9 కిలోమీటర్ల పొడవైన సొరంగం పనులతో మొదలైన ప్రాజెక్టు.. రాష్ట్రం ఏర్పడే నాటికి అంచనా వ్యయం రూ.4,900 కోట్లకు పెరిగింది. అందులో‌ రూ.2,700 కోట్లు ఖర్చు చేశారు. ఆ తర్వాత నుంచి ప్రాజెక్టుకు పైసా ఇవ్వలేదు.

అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును ముంగటేసుకున్న బీఆర్‌ఎస్ దానికి లక్ష కోట్లు ఖర్చు పెట్టింది. ఫలితంగా ఎస్‌ఎల్‌బీసీ పనులు నత్తనడకగా మారాయి. 2021 నుంచి ప్రాజెక్ట్ పనులు పెండింగ్‌లో పడ్డాయి. ఆ తర్వాత వరదలకు టన్నెల్ బోరింగ్ మెషీన్ పాడైంది. అప్పటి నుంచి దాని వంక నాటి సర్కార్ కన్నెత్తి చూడలేదు‌. మెషీన్ తెప్పించి పనులు చేయించలేదు.

ఇన్నేండ్లలో పెరిగిన సీపేజీ  

గత సర్కార్ నాలుగేండ్లు ప్రాజెక్టు పనులను పక్కనబెట్టడంతో టన్నెల్ పైన సీపేజ్​కూడా పెరిగిందని అధికారులు చెప్తున్నారు. అప్పుడప్పుడు సీపేజ్​వచ్చినప్పుడల్లా కెమికల్ గ్రౌటింగ్ చేసి సమస్యలకు పరిష్కారం చూపించారు. ఇన్నేండ్లలో  సీపేజ్​పెరిగి శ్లాబ్ గుల్లగా మారిందని అంటున్నారు. ఫలితంగా బోరింగ్ చేసేటప్పుడు సడన్‌గా బురద వరద తన్నుకొచ్చిందని చెప్తున్నారు.

అప్పట్లోనే పనులను చేసి ఉంటే ఇంతటి ప్రమాదం జరిగి ఉండేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి‌. వాస్తవానికి గతంలోనే టన్నెల్  ప్రాంతంలో నిమిషానికి 10 వేల లీటర్ల మేర నీళ్ల సీపేజ్​వస్తున్నట్టు గుర్తించారు. సిమెంట్‌ గ్రౌటింగ్ చేసినా ఫలితం లేకపోయింది. కెమికల్ గ్రౌటింగ్ చేసినా అన్ని చోట్లా అది సెట్ కాలేదు. అక్కడ గులక, మట్టి, రాళ్ల కాంబినేషన్‌తో కూడిన సాయిల్ ఉండడంతో ఒక్కసారిగా వరద కిందకు దూకి పైకప్పు కూలిందని చెప్తురు.

ఇప్పటివరకు 33 కిలోమీటర్ల మేరటన్నెల్‌పనులు పూర్తి చేయగా.. మరో 10 కిలోమీటర్ల పనులు పెండింగ్‌ పడ్డాయి. ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ సర్కారు.. నిరుడు అక్టోబర్‌లో రూ.4,600 కోట్ల నిధులు విడుదల చేసింది. టన్నెల్ బోరింగ్ మెషీన్‌ను అమెరికా నుంచి తెప్పించి,  పనులు మొదలుపెట్టిన అంతలోనే ఈ ప్రమాదం జరిగింది.