IND vs ENG, 2nd Test: బుమ్రా టాప్ క్లాస్ బౌలింగ్..తడబడుతున్న ఇంగ్లాండ్

IND vs ENG, 2nd Test: బుమ్రా టాప్ క్లాస్ బౌలింగ్..తడబడుతున్న ఇంగ్లాండ్

వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు రాణిస్తున్నారు. ఒక దశలో వికెట్లు తీయడానికి కష్టపడిన మన బౌలర్లు స్వల్ప వ్యవధిలో ఇంగ్లీష్ జట్టు మూడు కీలక వికెట్లు పడగొట్టి పై చేయి సాధించారు. రెండో రోజు రెండో సెషన్ ముగిసేసరికి ఇంగ్లాండ్ 33 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ (5), వికెట్ కీపర్ బ్యాటర్ బెయిర్ స్టో క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 241 పరుగులు వెనకబడి ఉంది.
 
లంచ్ కు ముందు వికెట్లేమీ కోల్పోకుండా 32 పరుగులు చేసిన ఇంగ్లాండ్.. ఆ తర్వాత సెకండ్ సెషన్ లో 27 ఓవర్లలోనే  ఏకంగా 123 పరుగులు సాధించింది. ఓపెనర్ డకెట్ త్వరగానే ఔటైనా.. క్రాలి భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పోప్ కూడా జాగ్రత్తగా ఆడటంతో వికెట్ నష్టానికి 114 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ దశలో  ప్రమాదకరంగా మారుతున్న క్రాలిని అక్షర్ వెనక్కి పంపాడు. 

78 బంతుల్లోనే క్రాలి 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. ఈ దశలో బుమ్రా స్పెల్ కు ఇంగ్లాండ్ బ్యాటర్లు విలవిల్లాడారు. 5 పరుగులు చేసిన రూట్ స్లిప్ లో గిల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మరోవైపు క్రీజ్ లో కుదురుకుంటున్న పోప్ ను బుమ్రా అద్బుత్తమైన యార్కర్ తో క్లీన్ బౌల్డ్ చేశాడు. బుమ్రా వేసిన ఈ బంతికి మూడు స్టంప్స్ కింద పడిపోయాయి. ఈ సెషన్ కి ఈ బాల్ హైలెట్ గా నిలిచింది. అంతకముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 396 పరుగులకు ఆలౌటైంది.