ముల్తాన్: ఆల్‌రౌండ్ షోతో చెలరేగిన ఇంగ్లండ్.. పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో గ్రాండ్ విక్టరీని సాధించింది. బౌలింగ్‌లో జాక్ లీచ్ (4/30) స్పిన్ మ్యాజిక్ చూపెట్టడంతో.. ఇన్నింగ్స్ 47 రన్స్ తేడాతో నెగ్గింది. దీంతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లీష్ టీమ్ 1–0 లీడ్‌లో నిలిచింది. 152/6 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం ఐదో రోజు ఆట కొనసాగించిన పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 54.5 ఓవర్లలో 220 రన్స్‌కు ఆలౌటైంది. సల్మాన్ ఆగా (63), అమెర్ జమాల్ (53) హాఫ్ సెంచరీలు చేశారు. ఈ ఇద్దరు ఏడో వికెట్‌కు 109 రన్స్ జత చేసి ఇంగ్లండ్ విజయాన్ని కాసేపు ఆలస్యం చేశారు.
షాహిన్ ఆఫ్రిది (10), నసీమ్ షా (6) ఫెయిలయ్యారు. జ్వరం కారణంగా అబ్రార్ అహ్మద్ బ్యాటింగ్‌కు రాలేదు. అట్కిన్సన్, కార్సీ చెరో రెండు వికెట్లు తీశారు. హ్యారీ బ్రూక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. తాజా ఓటమితో పాకిస్తాన్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఇన్నింగ్స్‌లో 500లకు పైగా రన్స్ చేసినా ‘ఇన్నింగ్స్ తేడాతో’ ఓడిపోయిన తొలి జట్టుగా నిలిచింది.
ఇక ఇరుజట్లు తమ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వందలకు పైగా రన్స్ చేసిన సందర్భంలో ఫలితాన్ని రాబట్టిన రెండో మ్యాచ్ ఇది. 2022లో ఇంగ్లండ్ 74 రన్స్ తేడాతో పాక్‌పై నెగ్గిన సందర్భం మొదటిది. ఈ ఓటమితో పాక్.. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో చివరిదైన 9వ ర్యాంక్‌కు పడిపోయింది. ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఆరు ఓటములతో 16 పాయింట్లతో ఉంది.