- టీమిండియా చేతుల్లోకి మూడో టెస్టు
- ఇంగ్లండ్ 319 ఆలౌట్
- సిరాజ్‌కు నాలుగు వికెట్లు
- రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా 196/2
రాజ్‌కోట్ : ఇండియా 130.5 ఓవర్లు ఆడి 445 రన్స్ చేస్తే.. ఇంగ్లండ్ తమ బజ్‌బాల్ ఆటతో 35 ఓవర్లలోనే 207 రన్స్ కొట్టేసింది.ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా సీనియర్ స్పిన్నర్ అశ్విన్ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. ఇంగ్లిష్ టీమ్ అదే జోరు కొనసాగిస్తే ఎలా అన్న అనుమానాలు మొదలైన టైమ్‌లో మన హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ (4/84) ముందుండి నడిపించగా నలుగురు బౌలర్లే ప్రత్యర్థి పని పట్టారు. 29 రన్స్ తేడాతో చివరి ఐదు వికెట్లు పడగొట్టి ఇండియాకు భారీ ఆధిక్యాన్ని కట్టబెట్టారు. ఆపై యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (133 బాల్స్‌లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 104 రిటైర్డ్ హర్ట్) సిరీస్‌లో వరుసగా సెంచరీతో ఇంగ్లండ్‌కు అసలైన బజ్‌బాల్ ఆటను చూపెట్టాడు. దాంతో మూడో టెస్టును ఇండియా పూర్తిగా తన కంట్రోల్‌లోకి తెచ్చుకుంది.
మూడో రోజు, శనివారం ఆట చివరకు ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 51 ఓవర్లలోనే 196/2 స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్ లీడ్ కలుపుకొని ఇప్పటికే 322 పరుగుల ఆధిక్యంతో పైచేయి సాధించింది. శుభ్‌మన్ గిల్ (65 బ్యాటింగ్), కుల్దీప్ యాదవ్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 71.1 ఓవర్లలో 319 రన్స్‌కు ఆలౌటైంది. దాంతో ఇండియాకు 126 రన్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ లభించింది. బెన్ డకెట్ (153)కు తోడు బెన్ స్టోక్స్ (41) మాత్రమే రాణించాడు. సిరాజ్ నాలుగు, కుల్దీప్, జడేజా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఆదివారం ఇండియా మరో 150 రన్స్ చేసినా ప్రత్యర్థికి భారీ టార్గెట్ ఇవ్వొచ్చు.
బెడిసికొట్టిన బజ్‌బాల్ గేమ్..
ఓవర్ నైట్ స్కోరు 207/2తో ఆట కొనసాగిస్తూ భారీ స్కోరుపై కన్నేసిన ఇంగ్లండ్‌ను మొదటి సెషన్‌లోనే ఆతిథ్య బౌలర్లు దెబ్బకొట్టారు. ఆ టీమ్ బజ్‌బాల్ గేమ్ బెడిసికొట్టింది. ఆట మొదలైన ఐదో ఓవర్లోనే బుమ్రా బౌలింగ్‌లో రివర్స్ ర్యాంప్ షాట్ ఆడే ప్రయత్నంలో జో రూట్ (18) రెండో స్లిప్‌లో జైస్వాల్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఇండియాకు బ్రేక్ లభించింది. తర్వాతి ఓవర్లోనే కుల్దీప్ టర్నింగ్ బాల్‌తో బెయిర్‌స్టో (0)ను డకౌట్ చేసి ఇంగ్లండ్‌కు షాకిచ్చాడు. కెప్టెన్ స్టోక్స్ జతగా ధాటిగా ఆడిన డకెట్ 139 బాల్స్‌లోనే 150 పూర్తి చేసుకున్నాడు. అయితే, రెండో రోజు తన బౌలింగ్‌లో షాట్లతో విరుచుకుపడ్డ డకెట్‌ను సింపుల్ బాల్‌తో ఔట్ చేసిన కుల్దీప్ రివెంజ్ తీర్చుకున్నాడు. దాంతో ఇంగ్లండ్ 255/5తో ఇబ్బందుల్లో పడింది.
ఈ టైమ్‌లో బెన్ ఫోక్స్ (13)తో ఆరో వికెట్‌కు 39 రన్స్ జోడించిన స్టోక్స్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ, లంచ్ తర్వాత మరింత దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన ఇంగ్లండ్ అంతే స్పీడులో వికెట్లు కోల్పోయింది. జడేజా స్ట్రెయిట్ బాల్‌కు స్టోక్స్ లాంగాన్‌లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చాడు. జడేజా తన రెండో వికెట్‌గా హార్ట్‌లీ (9)ని ఔట్ చేశాడు. ఓ లెంగ్త్ బాల్‌తో ఫోక్స్‌ను వెనక్కుపంపిన సిరాజ్ పదునైన యార్కర్ తో రెహాన్ (6)ను బౌల్డ్ చేశాడు. అండర్సన్ (1) చివరి వికెట్‌గా బౌల్డ్ అయ్యాడు.
జైస్వాల్, గిల్ జోరు
ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి రెండో సెషన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఇండియాను యశస్వి ముందుండి నడిపించాడు. కెప్టెన్ రోహిత్ (19) స్వీప్ షాట్ ఆడబోయి రూట్ బౌలింగ్‌లో ఎల్బీ అయినా గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. తన స్టయిల్‌కు భిన్నంగా గిల్ జాగ్రత్తగా ఆడుతూ స్ట్రయిక్ రొటేట్ చేసే బాధ్యత తీసుకోగా.. జైస్వాల్ మాత్రం దూకుడు కొనసాగించాడు. బెన్ స్టోక్స్ వరుసగా ఫీల్డింగ్, బౌలింగ్‌లో మార్పులు చేసినా తను మాత్రం ఎక్కడా తగ్గలేదు. రెహాన్ అహ్మద్ బౌలింగ్ రివర్స్ స్వీప్ షాట్లతో రెండు బౌండ్రీలు కొట్టాడు. సీనియర్ పేసర్ అండర్సన్ బౌలింగ్‌లో హూక్ షాట్‌తో సిక్స్ కొట్టిన అతను.. హార్ట్‌లీ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో జోరు చూపెట్టాడు.
ఈ క్రమంలో 80 బాల్స్‌లో ఫిఫ్టీ దాటిన జైస్వాల్ తర్వాత మరింత స్పీడ్ పెంచాడు. రెహాన్, రూట్ బౌలింగ్‌లోనూ భారీ షాట్లతో అలరించాడు. ఇంకోవైపు గిల్ కూడా వీలు చిక్కినప్పుడల్లా బౌండ్రీలు కొట్టాడు. మార్క్ వుడ్ షార్ట్ బాల్స్‌ను ఎదుర్కోవడంతో కాస్త ఇబ్బంది పడ్డ యశస్వి 90ల్లోకి వచ్చిన తర్వాత సింగిల్స్‌తో ముందుకెళ్తూ 122 బాల్స్‌లో సెంచరీ అందుకున్నాడు. ఆ వెంటనే గిల్ ఫిఫ్టీ (98 బాల్స్‌లో) మార్కు దాటాడు. చివరకు నడుం నొప్పి కారణంగా యశస్వి రిటైర్ అవ్వగా.. నాలుగో నంబర్‌లో వచ్చిన రజత్ పటీదార్ (0) హార్ట్‌లీ బౌలింగ్‌లో డకౌటయ్యాడు. నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన కుల్దీప్‌తో కలిసి గిల్ రోజును ముగించాడు.