SL vs ENG: లంకతో బజ్‌బాజ్ వీరుల సమరం.. పటిష్టమైన జట్టు ప్రకటన

SL vs ENG: లంకతో బజ్‌బాజ్ వీరుల సమరం.. పటిష్టమైన జట్టు ప్రకటన

స్వదేశంలో ఆగష్టు 21 నుంచి శ్రీలంకతో ప్రారంభంకానున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ECB జట్టును ప్రకటించింది. బెన్ స్టోక్స్ సారథ్యంలో 14 మంది సభ్యులతో కూడిన దుర్భేధ్యమైన జట్టును ఎంపిక చేసింది. ఓపెనర్ జాక్ క్రాలే, పేసర్ డిల్లాన్ పెన్నింగ్‌టన్‌లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. మరో పేసర్ ఓలీ స్టోన్ మూడేళ్ళ తర్వాత టెస్ట్ జట్టులోకి తిరిగొచ్చాడు. 

బెన్ డకెట్.. ఓలీ పోప్

కివీస్ ఓపెనర్ బ్రెండన్ మెక్ కల్లమ్ ఇంగ్లండ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వారి బ్యాటింగ్ శైలిలో చాలా మార్పొచ్చింది. టెస్టులనూ టీ20 తరహాలో ఆడుతూ ప్రత్యర్థి జట్టు బౌలర్లలో వణుకు పుట్టిస్తున్నారు. పైగా దానికి 'బజ్‌బాజ్' అని పేరట్టుకొని శివాలెత్తి పోతున్నారు. ఆఖరకు ఆరంభంలో వికెట్లు పడినా.. వారి ఆటలో దూకుడు మాత్రం తగ్గట్లేదు. ముఖ్యంగా, ఓపెనర్ బెన్ డకెట్.. వన్‌డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బౌండరీల మోత మోగిస్తున్నారు. అలాంటి ఇంగ్లీష్ జట్టును.. లంక ఏ మేరకు అడ్డుకుంటుందనేది ఆసక్తికరం. 

ఆగష్టు 21న మాంచెస్టర్‌లో సిరీస్ ప్రారంభం కానుండగా.. తదుపరి రెండు టెస్టు ఆగస్టు 29 నుంచి లార్డ్స్‌లో, మూడో టెస్టు సెప్టెంబర్ 6 నుంచి ఓవల్‌ వేదికగా జరగనున్నాయి.

శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), డేనియల్ లారెన్స్, బెన్ డకెట్, ఆలీ పోప్ (వైస్ కెప్టెన్), జో రూట్ , జోర్డాన్ కాక్స్, హ్యారీ బ్రూక్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్, ఆలీ స్టోన్, మాట్ పాట్స్.