టీ20 వరల్డ్‌కప్ సూపర్ 12 లో భాగంగా ఇంగ్లండ్ , ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ టీమ్ విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 19.4 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌట్ అయింది. 12 బంతుల వ్యవధిలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు చివరి ఐదు వికెట్లను కోల్పోయింది. ఆఫ్ఘన్ జట్టులో ఇబ్రహీం జద్రాన్ (32), ఉస్మాన్ ఘనీ (30) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు. పేసర్ సామ్ కరన్ 3.4 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసి ఆఫ్ఘన్ జట్టును కట్టడి చేశాడు.
113 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు జోస్ బట్లర్ 18, హెల్స్ 19 పరుగులు చేసి త్వరగానే పెవిలియన్ కు చేరారు. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన డెవిడ్ మలాన్ 18 , బెన్ స్టోక్స్ 2 పరుగులకే వెనుదిరిగారు. బ్రూక్ కూడా 2 పరుగులకే ఔటయ్యాడు. లివింగ్ స్టోన్, మొయిన్ అలీతో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. లివింగ్ స్టోన్ 21 బంతుల్లో 3 ఫోర్లతో 29 పరుగులు చేశాడు. ఆఫ్ఘాన్ బౌలర్లలో ఫారుకీ,రహ్మన్, రషీద్ ఖాన్, మాలిక్, నబీ చెరో వికెట్ తీశారు.