IND vs ENG: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్..హైదరాబాద్‌కు చేరుకున్న ఇంగ్లాండ్ జట్టు

IND vs ENG: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్..హైదరాబాద్‌కు చేరుకున్న ఇంగ్లాండ్ జట్టు

టీమిండియాతో 5 టెస్టుల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ జట్టు తొలి టెస్టు ఆడేందుకు సిద్ధమవుతుంది. జనవరి 25న హైదరాబాద్ వేదికగా ఈ టెస్టు మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తుంది. తాజాగా (జనవరి 21) ఇంగ్లాండ్ స్క్వాడ్ హైదరాబాద్ లోకి అడుగుపెట్టింది. కోచ్ బ్రెండన్ మెకల్లమ్, ఇంగ్లండ్ జట్టు అబుదాబిలో ప్రాక్టీస్ షెడ్యూల్‌ను ముగించుకుని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.           

సొంతగడ్డపై గత 11 సంవత్సరాలుగా భారత్ టెస్టు సిరీస్ ఓడిపోలేదు. టీమిండియా చివరిసారిగా 2012 లో ఇంగ్లాండ్ చేతిలో సొంతగడ్డపై 1-2 తేడాతో సిరీస్ ఓడిపోయింది. దీంతో ఈ సిరీస్ లో భారత్ హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. మరోవైపు ఇంగ్లాండ్ మాత్రం తమకు కలిసొచ్చిన బజ్ బాల్ క్రికెట్ ఆడతామని ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ సిరీస్ కు ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాల వలన సిరీస్ మొత్తానికి దూరమవడంతో ఆ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఎప్పడూ లేని విధంగా ఈ సారి భారత పర్యటనకు ఇంగ్లాండ్ ఏకంగా నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడం ఆసక్తికరంగా మారింది.
     
భారత్ రానున్న నెలన్నర పాటు ఇంగ్లాండ్ తో టెస్టులు ఆడనుంది. జనవరి 25 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ మార్చ్ 11 తో ముగుస్తుంది. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు హైదరాబాద్ లో జరగనుంది. విశాఖపట్నం, రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాలలో వరుసగా 2,3,4,5 టెస్టులు ఆడాల్సి ఉంది. భారత్ కు రోహిత్ శర్మ, ఇంగ్లాండ్ కు బెన్ స్టోక్స్ సారధ్యం వహిస్తారు. మ్యాచ్ లన్నీ భారత కాలమాన ప్రకారం ఉదయం 9:30 నిమిషాలకు జరుగుతాయి.