Ben Wells: అరుదైన గుండె జబ్బు.. 23 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్ బై

Ben Wells: అరుదైన గుండె జబ్బు.. 23 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్ బై

అరుదైన గుండె వ్యాధి బారిన పడిన ఓ క్రికెటర్.. అర్థాంతరంగా తన కెరీర్ ముగించాడు. గ్లౌసెస్టర్‌షైర్ వికెట్ కీపర్/బ్యాటర్ బెన్ వెల్స్ 23 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను అరిథ్మోజెనిక్ రైట్ వెంట్రిక్యులర్ కార్డియోమయోపతి బారిన పడినట్లు ఇటీవల హార్ట్ స్క్రీనింగ్ పరీక్షల్లో వెల్లడైంది. అందునా, ఈ వ్యాధి బారిన పడిన వారు తీవ్రమైన వ్యాయామానికి దూరంగా ఉండాలి. ప్రొఫెషనల్ క్రికెట్‌లో అది సాధ్యం కాదు. అందువల్ల వెల్స్ బాధాకర హృదయంతో తన రిటైర్మెంట్ ప్రకటనను బహిరంగ పరిచాడు. 

"ఇలాంటి రోజు వస్తుందని, ఇలాంటి ప్రకటన చేయాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఇది కఠిన సమయం అయినప్పటికీ, ఈ రోగనిర్ధారణ బహుశా నా ప్రాణాన్ని కాపాడింది. అందుకు వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. క్రికెట్ నన్ను తీసుకెళ్లే మార్గం ఇదే అని నేను ఎప్పుడూ ఊహించలేను. ఇన్నాళ్లు జీవించే అవకాశం నాకు లభించినందుకు నేను చాలా కృతజ్ఞుడను. కొన్నేళ్లు నేను ప్రొఫెషనల్ క్రికెటర్ అని చెప్పుకోగలిగినందుకు ఎంతో గర్వపడుతున్నా. చిన్నప్పుడు మా తమ్ముడితో కలిసి గార్డెన్‌లో ఆడటం, స్కూల్‌లో బ్రేక్ టైమ్‌లో చేసే అల్లరి పనులు, బాత్ క్రికెట్ క్లబ్ సమ్మర్ క్యాంప్‌లకు వెళ్లడం, గ్లౌసెస్టర్‌షైర్‌ తరుపున క్రికెట్ ఆడటం చెరగని జ్ఞాపకాలు. ఇవన్నీఆస్వాదించినందుకు నేను సంతోషిస్తున్నా.. బాధాకర హృదయంతో తప్పుకుంటున్నా.." అని వెల్స్ తన బహిరంగ లేఖలో పేర్కొన్నాడు.

23 ఏళ్ల వెల్స్ 2021లో అరంగేట్రం చేశాడు. అతని మూడేళ్ల దేశీయ కెరీర్‌లో 1 ఫస్ట్-క్లాస్ గేమ్, 15 లిస్ట్ -ఏ మ్యాచ్‌లు, 9 టీ20లు ఆడాడు. అతని చివరి దేశీయ ఆట, డర్హామ్‌తో జరిగిన వన్-డే కప్ లో తన తొలి సెంచరీ సాధించాడు.