Dawid Malan: అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ ఓపెనర్ గుడ్ బై

Dawid Malan: అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ ఓపెనర్ గుడ్ బై

ఇంగ్లండ్ ఓపెనర్, పంజాబ్ కింగ్స్ మాజీ బ్యాటర్ డేవిడ్ మలన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో చివరిసారిగా బరిలోకి దిగిన 37 ఏళ్ల ఈ ఓపెనర్.. ఆ తర్వాత మళ్లీ ఇంగ్లండ్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. 

ఇంగ్లీష్ జట్టు తరుపున 2017లో అంతర్జాతీయ అరంగ్రేటం చేసిన మలన్.. 22 టెస్టులు, 30 వన్డేలు, 62 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 1074, వన్డేల్లో 1450, టీ20ల్లో 1892 పరుగులు చేశాడు. నిలకడగా ఆడటంతో సమర్థుడు. అతన్ని ఔట్ చేయాలంటే బౌలర్లు శక్తికి మించి శ్రమించాల్సిందే. టీ20ల్లో ఈ ఇంగ్లీష్ ఓపెనర్ కు మంచి రికార్డ్ ఉంది. పొట్టి ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 1,000 పరుగులు చేసిన బ్యాటర్.. ఈ క్రికెటరే. 24 ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి పరుగులు మార్కును చేరుకున్నాడు. 2020 సెప్టెంబరులో టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు.

సఫారీలకు చుక్కలు

కార్డిఫ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తన అరంగేట్ర మ్యాచ్‌లో మలన్ సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 12 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 44 బంతుల్లోనే 78 పరుగులు సాధించాడు. అదే ఏడాదిఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్‌లో మెరుపు శతకం బాదాడు. అతని కెరీర్‌లో ఇలాంటి మరుపురాని ఇన్నింగ్స్‌లు ఎన్నో ఉన్నాయి. ఇంగ్లండ్ తరుపున మూడు ఫార్మాట్లలోనూ శతకాలు బాదిన ఇంగ్లిష్‌ రెండో బ్యాటర్‌ మలన్. ఈ ఓపెనర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ తరుపున ఆడాడు. 2021 సీజన్‌లో ఒకే ఒక మ్యాచ్ ఆడి 26 పరుగులు చేశాడు.

రిటైర్మెంట్‌కు కారణం అదేనా..!

సెప్టెంబర్ 11 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న టీ20, వన్డే సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇటీవలే తమ జట్టును ప్రకటించింది. ఆ జట్టులో మలన్‌కు చోటు దక్కలేదు. ఈ క్రమంలోనే అతను రిటైర్మెంట్ ప్రకటించాడని వార్తలు వస్తున్నాయి. 

ఇంగ్లండ్ టీ20 జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్సే, జోర్డాన్ కాక్స్, సామ్ కర్రాన్, జోష్ హల్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, సాకిబ్ మహమూద్, డాన్ మౌస్లీ, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, టర్నర్.

ఇంగ్లండ్ వన్డే జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జోష్ హల్, విల్ జాక్స్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జామీ స్మిత్, రీస్ టోప్లీ, టర్నర్.