ఒకరి జెర్సీతో మరొకరు.. ఇంగ్లండ్ ఆటగాళ్లు ఎందుకిలా చేశారు?

ఒకరి జెర్సీతో మరొకరు.. ఇంగ్లండ్ ఆటగాళ్లు ఎందుకిలా చేశారు?

ఎప్పుడు వివాదాలతో వార్తల్లో నిలిచే ఇంగ్లండ్ ఆటగాళ్లు.. ఈసారి సమాజం పట్ల వారు చూపిన ఉదారతతో వార్తల్లోకెక్కారు. యాషెస్ సిరీస్ ఆఖ‌రి టెస్ట్ మూడో రోజు ఆట ప్రారంభం కావడానికి ముందు ఇంగ్లండ్ ఆట‌గాళ్లు ఒక‌రి జెర్సీని మ‌రొక‌రు ధరించి మైదానంలోకి అడుగుపెట్టారు. అదేంటీ..? వాళ్ల‌కు ఏమైనా మ‌తిమ‌రుపా? అని న‌వ్వుకోకండి. దీని వెనుక ఓ మంచి కార‌ణం ఉంది. సమాజానికి తమ వంతుగా ఏదైనా చేయాలనే వారి దృఢ సంకల్పం ఉంది. 

డెమెన్షియా పేషంట్లకు మద్ధతుగా 

అల్జీమ‌ర్స్‌(డెమెన్షియా)తో బాధ‌ప‌డుతున్న వారికి మ‌ద్ద‌తుగా ఇంగ్లండ్ ఆటగాళ్లు అలా జెర్సీలు ధ‌రించారు. డెమెన్షియా అంటే ఒకరకంగా మతిమరుపు. మెదడు పనితీరు సామర్థ్యాన్ని దారుణంగా దెబ్బతీసే ఒక మానసిక రుగ్మత. ఈ సమస్య ఉన్నవారు తినడం మర్చిపోవచ్చు. పళ్ళెంలో వడ్డించిన వాటిని చూసి కన్‌ఫ్యూజ్ అయిపోవచ్చు. ఆఖరికి మనుషులను సైతం గుర్తు పట్టలేకపోవచ్చు. ఇలా చిత్తవైకల్యంతో బాధపడుతున్న వారికి మద్దతుగా నిలవడం కోసం ఇంగ్లండ్ ఆట‌గాళ్లు ఒక‌రి జెర్సీని మ‌రొక‌రు ధరించి మైదానంలోకి అడుగుపెట్టారు.

జేమ్స్ ఆండర్సన్.. స్టువర్ట్ బ్రాడ్ జెర్సీని ధరించగా, జానీ బెయిర్‌స్టో.. బెన్ స్టోక్స్ జెర్సీని, మోయిన్ అలీ.. క్రిస్ వోక్స్ జెర్సీని ధరించారు. అందుకు సంబంధిచిన ఫోటోలను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో పంచుకుంది.