- 41 రన్స్‌తో నమీబియాపై గెలుపు
- రాణించిన బ్రూక్, బెయిర్‌స్టో
నార్త్ సౌండ్ (అంటిగ్వా) : డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ టీ20 వరల్డ్ కప్‌లో సూపర్–8 రౌండ్‌కు చేరుకుంది. కచ్చితంగా గెలవాల్సిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో వర్షం భయపెట్టినా నమీబియాను ఓడించి గట్టెక్కింది. మరో పోరులో ఆస్ట్రేలియా చేతిలో స్కాట్లాండ్ ఓడిపోవడంతో ఇంగ్లండ్ తర్వాతి రౌండ్‌లో అడుగు పెట్టింది. నాలుగు మ్యాచ్‌ల్లో ఒకటి వర్షంతో రద్దవగా.. రెండు విజయాలు, ఓ ఓటమితో ఇంగ్లిష్ టీమ్ ఐదు పాయింట్లు, మెరుగైన రన్ రేట్ (3.611)తో ముందంజ వేసింది. ఆస్ట్రేలియా 8 పాయింట్లతో టాపర్‌గా నిలవగా...
స్కాట్లాండ్ (5) రన్‌రేట్ (1.255)లో వెనుకబడి మూడో ప్లేస్‌తో సరిపెట్టింది. శనివారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్–బి చివరి పోరులో హ్యారీ బ్రూక్ (20 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌కు తోడు బౌలర్ల సపోర్ట్‌తో ఇంగ్లిష్ టీమ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 41 రన్స్ తేడాతో గెలిచింది.వర్షం అంతరాయం పలుమార్లు కలిగించడంతో ఈ మ్యాచ్‌ను తొలుత 11 ఓవర్లకు ఆ తర్వాత 10 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లిష్ టీమ్ 10 ఓవర్లలో 122/5 స్కోరు చేసింది. రెండో ఓవర్లోనే ఓపెనర్, కెప్టెన్ జోస్ బట్లర్ (0)ను డకౌట్ చేసిన ట్రంపెల్‌మన్ ఇంగ్లండ్‌కు షాకిచ్చాడు.
ఆ వెంటనే ఫిల్ సాల్ట్ (11)ను వీస్ వెనక్కుపంపడంతో ఆ టీమ్ 13/2తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో జానీ బెయిర్‌స్టో (18 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 31), బ్రూక్ భారీ షాట్లతో బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. మూడో వికెట్‌కు 56 రన్స్ జోడించిన తర్వాత బెయిర్ స్టో ఔటైనా.. బ్రూక్ తోడుగా 6 బాల్స్‌లో 2 సిక్సర్లతో 16), లివింగ్ స్టోన్ (4 బాల్స్‌లో 2 సిక్సర్లతో 13) వేగంగా ఆడటంతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. అనంతరం డక్‌వర్త్ ప్రకారం నమీబియా టార్గెట్‌ను 10 ఓవర్లలో 126 రన్స్‌గా లెక్కగట్టారు. ఛేజింగ్‌లో ఓవర్లన్నీ ఆడిన ఆ టీమ్ 84/3 స్కోరు మాత్రమే చేసి ఓడింది.
ఛేజింగ్‌లో నమీబియా కూడా ధాటిగానే ఆడినా ఆ వేగం సరిపోలేదు. ఓపెనర్లు మైకేల్ వాన్ లింగెన్ (33), నికోలస్ డేవిన్ (18) తొలి వికెట్‌కు ఆరు ఓవర్లో 44 రన్స్ జోడించి మంచి ఆరంభం ఇచ్చారు. డెవిన్ రిటైర్డ్ హర్ట్ అవ్వడంతో ఈ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయింది. డన్‌డౌన్ బ్యాటర్ డేవిడ్ వీస్ (12 బాల్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 27) జోరు చూపెట్టి ఆశలు రేపాడు. కానీ, ఇంగ్లండ్ బౌలర్లు వాళ్లకు ఎలాంటి చాన్స్ ఇవ్వలేదు. లింగెన్‌ను జోర్డన్, వీస్‌ను ఆర్చర్ ఐదు బాల్స్ తేడాలో పెవిలియన్ చేర్చి ఇంగ్లిష్ టీమ్‌ను గెలిపించారు. హ్యారీ బ్రూక్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్ : 10 ఓవర్లలో 122/5 (బ్రూక్ 47*, బెయిర్‌స్టో 31, ట్రంపెల్‌మన్ 2/31)
నమీబియా (టార్గెట్ 126) : 10 ఓవర్లలో 84/3 (వాన్ లింగెన్ 33, వీస్ 27, ఆర్చర్ 1/15)