టీమిండియాతో జరగబోయే తొలి టీ20కి ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు (జనవరి 22) కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగబోయే తొలి మ్యాచ్ కు ఇంగ్లాండ్ పటిష్టంగా కనిపిస్తుంది. ఇంగ్లాండ్ తుది జట్టు విషయానికి వస్తే నలుగురు స్పెషలిస్ట్ పేసర్లతో బరిలోకి దిగడం షాకింగ్ గా అనిపిస్తుంది. దీని వెనుక ఇంగ్లాండ్ వ్యూహం ఏంటనేది నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఇంగ్లాండ్ నలుగురు ఫాస్ట్ బౌలర్ల వెనుక కారణమేంటో ఇప్పుడు చూద్దాం.
ఇంగ్లాండ్ జట్టులో ఆర్చర్ కీలకమైన బౌలర్. యార్కర్లతో పాటు బౌన్సర్లు సంధించగలడు. ఏ క్షణంలోనైనా తన బౌలింగ్ తో మ్యాచ్ ను తిప్పగలడు. దీంతో ఆర్చర్ ఖచ్చితంగా జట్టులో ఉండాల్సిందే. ఎక్స్ ప్రెస్ వేగంతో బౌలింగ్ వేయగల మార్క్ వుడ్ ఇంగ్లాండ్ జట్టుకు అదనపు బలం. గతంలో భారత పర్యటనకు వచ్చినప్పుడు మార్క్ వుడ్ తన బౌలింగ్ తో ప్రభావం చూపాడు. అట్కిన్సన్, ఓవర్ టన్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ చేయగలరు. ప్రస్తుతం వీరిద్దరూ సూపర్ ఫామ్ లో ఉన్నారు. దీంతో వీరికి కూడా తుది జట్టులో స్థానం దక్కింది.
అనుభవం లేని స్పిన్నర్ రెహన్ అహ్మద్ ను జట్టులో తీసుకోవడం కంటే ఫామ్ లో ఉన్న ఫాస్ట్ బౌలర్లకు ఇంగ్లాండ్ ఓటేసింది. జట్టులో ఏకైక స్పిన్నర్ గా రషీద్ మాత్రమే ఉన్నాడు. లివింగ్ స్టోన్ పార్ట్ టైం స్పిన్నర్ గా అతని సేవలను వాడుకోవాలని చూస్తుంది. ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లు ఉండడంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ డెప్త్ తగ్గినట్టుగానే కనిపిస్తుంది. లోయర్ ఆర్డర్ లో మ్యాచ్ ను ఫినిష్ చేసే ఆటగాళ్లు కనిపించడం లేదు. ఫాస్ట్ బౌలర్లనే నమ్ముకున్న ఇంగ్లాండ్ విజయం సాధిస్తుందో లేదో చూడాలి.